ప్రణాళికాబద్ధంగా వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి
- జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 17 : జగిత్యాల జిల్లాలో వరి కోతలు ప్రణాళికాబద్ధంగా జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వరి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అవసరమైన మేరకు టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగుల, వెయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీసర్లు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని, కొనుగోలు సిబ్బందికి అవసరమైన మేరకు శిక్షణ అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కాంబ చేయాలని ఎదురుచూసే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ట్యాబ్ ఎంట్రీ జరిగేలా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. 2025 వానాకాలం సీజన్లో ధాన్యం నగదు, బోనస్ నగదు 48 నుంచి 72 గంటల లోగా రైతులకు ఖాతాలలో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత సీజన్లో మరింత మెరుగ్గా ధాన్యం కొనుగోళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను వరి కోతల కంటే ముందుగానే ప్రారంభించాలన్నారు. దీపావళి తర్వాత వరి కోతలు వేగం కానున్న నేపథ్యంలో జిల్లాలో గన్ని బ్యాగుల, ధాన్యం రవాణా ఏర్పాట్లు, ధాన్యం సెంటర్లలో ఇన్ ఫ్రా సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు క్రమ పద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉండాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఒకే చోట కొనుగోళ్లు చేస్తే రైతులకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక కౌంటర్లు పెట్టాలని, సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేర్వేరుగా రవాణా చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, శిక్షణ డిప్యుటీ కలెక్టర్ కన్నం హరిణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రఘువరన్, డిసివో మనోజ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేంద్ర రెడ్డి, డిఎం జితేంద్ర ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment