చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌లో..
ఏర్పడిన సమస్యలు పరిష్కరించాలి..
NARA విజ్ఞప్తి
రాజధాని వాయిస్ :
విజయవాడ ఫిబ్రవరి 16
రాష్ట్ర సమాచార & ప్రజా సంబంధాల శాఖ అమలు చేస్తున్న తాజా మీడియా అక్రిడిటేషన్ విధానాల్లో ఎంపానెల్‌మెంట్‌ను తప్పనిసరి అర్హతగా పరిగణించడం వల్ల చిన్న సర్కులేషన్ పత్రికలు, జిల్లా మరియు పట్టణ స్థాయి మీడియా సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) పేర్కొంది.గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడిటేషన్‌తో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా కవర్ చేసిన చిన్న పత్రికలు, కొత్త నిబంధనల కారణంగా ప్రస్తుతం అక్రిడిటేషన్‌కు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడిందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే ప్రధాన మాధ్యమాలుగా చిన్న పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రజాస్వామ్య వేదికలుగా అవి కొనసాగుతున్నాయని తెలిపింది.20–30 సంవత్సరాలుగా నిరంతర ప్రచురణతో విశ్వసనీయతను నిలబెట్టుకున్న పత్రికలు కఠిన ప్రమాణాల వల్ల మూతపడే ప్రమాదం ఉందని, ఇది మీడియా వ్యవస్థ బలహీనపడే పరిస్థితికి దారితీస్తుందని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) అభిప్రాయపడింది.
జిల్లా స్థాయిలో అసమాన విధానాలు అమలు అవుతున్నాయి
సంఘం దృష్టికి వచ్చిన అంశాల ప్రకారం కొన్ని జిల్లాల్లో చిన్న పత్రికలకు 6–7 నెలల అటెండెన్స్, అధిక ఆధారాలు కోరుతుండగా, పెద్ద పత్రికలకు తక్కువ కాలం 3 నెలల క్లిప్పింగ్స్‌తోనే అనుమతులు ఇస్తున్నారు. సమర్పించిన పత్రికల హాజరు పూర్తి స్థాయిలో నమోదు కాకపోవడం వల్ల అక్రిడిటేషన్ అవకాశాలు కోల్పోతున్నారు. ప్రతి జిల్లాలో విడివిడిగా హాజరు ఆధారాలు కోరడం ప్రాయోగికంగా సాధ్యం కావడం లేదు.గతంలో అమలులో ఉన్న సరళమైన విధానాలకు భిన్నంగా ప్రస్తుతం సాంకేతిక మరియు పరిపాలనా అడ్డంకులు పెరిగాయి.ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడిటేషన్‌కు అడ్డంకిగా మార్చకూడదు ప్రభుత్వ ప్రకటనల కోసం ఎంపానెల్‌మెంట్ అవసరం ఉన్నప్పటికీ, అక్రిడిటేషన్‌కు అది తప్పనిసరి అర్హతగా పేర్కొన్న స్పష్టమైన చట్టపరమైన నిబంధన లేదని సంఘం తెలిపింది. అందువల్ల ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని కోరింది.
నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ప్రధాన డిమాండ్లు
1. గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడిటేషన్ కలిగిన చిన్న పత్రికలను ప్రత్యేకంగా పునఃపరిశీలించాలి.
2. ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడిటేషన్‌కు తప్పనిసరి అర్హతగా పరిగణించే విధానాన్ని నిలిపివేయాలి.
3. పత్రికల అనుభవం, నిరంతర ప్రచురణ, విశ్వసనీయతను ప్రమాణాలుగా తీసుకోవాలి.
4. చిన్న మరియు పెద్ద పత్రికలపై సమాన ప్రమాణాలు అమలు చేయాలి.
5. అటెండెన్స్ నమోదు వ్యవస్థను పారదర్శకంగా, డిజిటల్ విధానంలో అమలు చేయాలి.
6. పబ్లికేషన్ సెంటర్ హాజరును ప్రామాణికంగా పరిగణించి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అక్రిడిటేషన్లు ఇవ్వాలి.
7. ఈ మార్పు దశలో చిన్న పత్రికలకు ఒకసారి సడలింపు కల్పించి మూడు నెలల పత్రికలను ఒకేసారి సమర్పించే అవకాశం ఇవ్వాలి.
8. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కనీసం రెండు అక్రిడిటేషన్లు చిన్న పత్రికలకు కేటాయించాలి.
9. తదుపరి నోటిఫికేషన్ నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలను కఠినంగా అమలు చేయవచ్చని సంఘం అంగీకరిస్తోంది.
మానవతా దృక్పథంతో ఒకసారి వెసులుబాటు అవసరం
ప్రస్తుతం ఉన్న కఠిన నిబంధనలు చిన్న పత్రికలను ఆర్థికంగా, పరిపాలనా పరంగా నిలదొక్కుకోలేని పరిస్థితిలోకి నెడుతున్నాయని, గత విధానానికి అనుగుణంగా ఈ ఒక్కసారి మార్గదశక సడలింపులు ఇవ్వడం న్యాయం మాత్రమే కాకుండా మీడియా వ్యవస్థపై ప్రభుత్వ విశ్వాసాన్ని బలపరుస్తుందని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (నారా) పేర్కొంది.ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన మార్గదర్శకాలు జారీ చేస్తుందని సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.



Post Comment