మాట పట్టులో మేటి కొలకలూరి గోపకవి…

రాజధాని వాయిస్:

ఆవేదనని, ఆలోచనని, ఆశయాన్ని, ఆక్రోషాన్ని మరియు అభ్యుదయాన్ని సమపాళ్లలో రంగరించి పరిణితి చూపుతూ సాహిత్య సృష్టి చేసినవారు, మాట పట్టు వలన మేటి అయిన కవి పుంగవుడు మరియు కవి కుమార బిరుదాంకితులు కొలకలూరి గోపకవి. వీరు సామాజిక ధర్మాన్ని బట్టి గాక మానవతా ధర్మాన్ని గమనంలో ఉంచుకొని తన సాహిత్య సృష్టి చేశారు.

విద్య – ఉద్యోగం – వైవాహిక జీవితం

కొలకలూరు గోపకవి అమరావతి మండలం నరుకులపాడు గ్రామంలో 1-7-1936 సంవత్సరంలో కొలకలూరి గంగమ్మ, భిక్షాలు దంపతులకు జన్మించారు. వీరు రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడుకి సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన కొలకలూరి భుజంగరాయడి వంశీయులు. గోపకవికి అక్షరాభ్యాసం చేసి, ప్రాథమిక విద్యను నేర్పి, తెలుగు భాషలో సుశిక్షితులను చేసిన వారు గురిందపల్లి వీర రాఘవులు మరియు వారి సోదరులు సాల్మన్ రాజు. శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్, అమరావతిలో ఎస్ ఎస్ ఎల్ సి పూర్తి చేశారు. ఎంపీపీ ప్రాథమికోన్నత పాఠశాల, మల్లాదిలో ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి వీరి గురువులు. గోపకవి తొలి రచన కన్య కుమారా ద్విశతికి ముందుమాట రాసి వారికి జరిగిన సన్మాన సభకు అధ్యక్షత వహించి, ఆశీర్వదించి కవి కుమార అనే బిరుదును కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రదానం చేశారు. తనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మహావాది వెంకటరత్నం పరిష్కరించేవారని తెలియజేశారు. ఆరేపల్లి శౌరమ్మను వివాహమాడి ఐదుగురు సంతానాన్ని పొందారు.

సత్కారాలు

కవిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన కొలకలూరు గోపకవి అనేక సన్మాన సత్కారాలు పొందారు. దావల ప్రసాదరావు గుంటూరు మరియు విజయవాడ పట్టణాల్లో అనేకసార్లు తనను సత్కరించారు. కంతేటి పానయ్య దుశాలువాతో సత్కరించారు. ఘనులు మార్టిన్ ఎలీషా సభలోనూ, ధరణికోట కళాశాలలో ఘనంగా వీరు సత్కరించబడ్డారు. చిలకా రాజేశ్వరి, జేసుదాసు దంపతులు గోపకవి విరచిత బొబ్బిలిపోరు కృతి ఆవిష్కరణ సమయంలో అమరావతి మండల ప్రాథమికోన్నత పాఠశాలలో వీరిని ఘనంగా సత్కరించుటే గాక ఉపాధ్యాయులందరి చేత గోప కవిని సత్కరించారు. కవి కంఠీరవుడు ఆచార్య కొలకలూరి ఇనాక్ వారి మాతృమూర్తి విశ్రాంతమ్మ స్మారక సభలో గోపకవి కి116/- ఇచ్చి సన్మానించారు. ఫాదర్ మారం రెడ్డి ఇన్నయ్య 116/- లు ఇచ్చి సత్కరించారు. గురజాలలో శరణం వారు గోపకవిని ఘనంగా సత్కరించారు. అమరావతి కతోలిక పల్లోటి సభ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ తోమస్ గోపకవి దంపతులను ఘనంగా సత్కరించారు. వీరికి ఫాదర్ జూజిగిరి ధర్మరాజు 1116/- ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఏకలవ్య కృతి సత్కార సభలో ఆచార్య మేకల రాజారావు, మల్లాది గ్రామ అధ్యక్షులు శ్రీమతి కళావతి నెల్సన్ మరియు వెంపా లక్ష్మీనరసింహారావు సమక్షంలో నాటి మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ వీరిని ఘనంగా సత్కరించారు. కొలకలూరి ఇశ్రాయేలు ఏకలవ్య కృతి సన్మాన సభలో ఘనంగా గోపకవిని సత్కరించారు. బొబ్బిలి పోరు కావ్యాన్ని ఆవిష్కరించి అంకితం తీసుకున్న సందర్భంలో మల్లాది నాట్యమండలి వారు మరియు మల్లాది పౌరులు గోపకవిని ఘనంగా సత్కరించారు.

బిరుదులు

పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళాపరిషత్, దుగ్గిరాల వారు కవికోకిల బిరుదునిచ్చి సన్మానించారు. వీరికి కవికుమార, కవిశేఖర, కవికోకిల మరియు ప్రజాకవి అను బిరుదులు కలవు. వీరి సాహిత్యంలో దళితాభ్యుదయకాంక్ష కనిపిస్తుంది.
నరుకులపాడులో శాంతి కుటీరంలోనూ, ధాన్యకటకంలోని ప్రసన్న సాహితీ నిలయంలో గోపకవి నివసించారు. వీరికి దేశభక్తి, మాతృభూమి మరియు మాతృమూర్తులన్న వల్లమాలిన ప్రేమ. వారు రచించిన ప్రతి కావ్యం లోను తన తల్లిదండ్రులను, తెలుగు గడ్డను మరియు భరతమాతను పొగుడుతూ పద్యాల రూపంలో వారి పట్ల తనకున్న ప్రేమను తెలియజేసేవారు.

రచనలు

వీరు కన్య కుమారా ద్విశతి, ఉషశ్రీ, దేవమాత శతకం, అరుణ శ్రీ, నక్షత్ర మాల, కోకిల, ఏకలవ్య, కలువ పూజ, బొబ్బిలి పోరు, వీర సంసోనియం, సుగుణ శీలుడు మొదలగు శతక, పద్య మరియు గద్య కావ్యాలు రచించారు. ఉదృత జలపాతం వంటి భావవేశం, నల్లేరు మీద నడక లాగా అవలీలగా పద్యాన్ని నడపగల ప్రతిభ గోపకవి కలానికి ఉంది.

కన్య కుమారా

గోపకవి రచించిన మొట్టమొదటి శతక పద్య కావ్యం కన్య కుమారా. దీనిని 1971లో రచించారు. 216 కంద పద్యాలతో రచించబడింది ఈ శతకం. ఈ శతక కావ్యం క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని, ఆయన మహత్కార్యాలను మరియు తత్వాన్ని తెలియజేస్తుంది. వర్తమాన సమాజంలో క్రైస్తవుల్లో సన్నగిల్లిన భక్తిని గురించి ఈ కావ్యంలో తూర్పర పట్టారు గోపకవి.

కలువ పూజ

20-10-1988 లో 116 పద్యాలతో భక్తి రస ప్రధానంగా, ప్రార్థన పూర్వక భావనతో ఈ పద్య కావ్యం రచించారు. క్రీస్తు భక్తిని మాత్రమే కాక సామాజిక స్పృహను కూడా మేళవించి ఈ శతకాన్ని రచించారు గోపకవి. భక్తి మార్గం ద్వారా లోక కళ్యాణాన్ని ఈ కావ్యంలో కాంక్షించారు. కలువ పూజ ఉత్పలమాల మరియు చంపకమాలలో రచించబడిన శతకం. కన్య మరియకు అంకితమిచ్చిన ఈ శతకం “కలువ పూజ నిరంజన మేరి నందనా” అను మకుటంతో రచించారు. మధురకవి నూతక్కి అబ్రహం ఆశీస్సులు పేరుతో, శ్రీమతి కొలకలూరి స్వరూపారాణి తావి పేరుతో ముందుమాటను, పినపాటి ప్రభుదాస్ వంటి వారు ఈ శతకంపై తమ అభిప్రాయాన్ని తెలియపరిచారు. ఈ కావ్యానికి రూపు రేఖలు నూతక్కి అబ్రహం కవి తీర్చిదిద్దారని గోపకవి పేర్కొన్నారు. ఈ శతకంలో దొర్లిన ముద్రారాక్షసాలను పినపాటి జెర్మియాకవి సరి చేయుటలో సహాయపడ్డారు. ఈ శతకంలో గోపకవి తన మాట రాస్తూ అమరావతిని ఏలిన రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి సేనాని భుజంగరాయడు మా కొలకలూరి ఇంట పుట్టిన పరాక్రమశాలి అని, మా ఇంటి పేరుకు వన్నె తెచ్చిన ధీశాలి అని అతనిని కీర్తించారు గోపకవి. కాకుమాను లక్ష్మయ్య ఈ శతకానికి ముఖ చిత్రాన్ని అందించారు. పుస్తకంలో దొర్లిన తప్పు ఒప్పులను ముద్రణ సమయంలో నేర్పుగా, ఓర్పుగా కోటిరెడ్డి తెలియజేశారని గోపకవి తెలియజేశారు.

ఏకలవ్య

గౌరవం వల్ల, లక్ష్య శుద్ధి వల్ల విద్యాసిద్ధి పొందుటకు నిలువెత్తు తార్కాణమైన ఏకలవ్యుని గురించిన పద్య కావ్యం ఇది. తన శైలియే తన వ్యక్తిత్వంగా పేరుందిన కవి గోపకవి. సమాజం పట్ల దిగులు అవ్యవస్థ పట్ల ఆవేదన మరియు ఉద్వేగాన్ని వ్యక్తపరుస్తూ 1991లో రచించబడిన ఈ కావ్యం ఆచార్య మేకల రాజారావు, సుశీలమ్మ దంపతులకు అంకితమిచ్చారు.
అనాదిగా మనుషుల మధ్య కులమత హెచ్చుతగ్గుల భేదభావం ప్రబలి మానవతా మంటగలిసి, అంటరానితనాన్ని అనుభవిస్తూ ఊరిలోని జనాలకు దూరంగా ఊరి బయట ఉంటూ నానా విధాలుగా బాధలు అనుభవిస్తున్న దళితుల దీనస్థితికి ఉదాహరణగా ఈ ఏకలవ్య కావ్యాన్ని రచించి, సర్వ మానవ సౌబ్రాతృత్వాన్ని కాంక్షించారు గోపకవి. ఆంధ్ర క్రైస్తవ కళాశాల, కళాశాల, గుంటూరులో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్న నేలటూరి కిషోర్ బాబు పలుకరింత పేరు తోను, డాక్టర్ వావిలాల సుబ్బారావు నాలోని మాట పేరుతో ఏకలవ్య కావ్యానికి ముందుమాట రాశారు. విజయ ఆర్ట్ ప్రెస్, తెనాలి వారు ఎనిమిది వందల ప్రతులను ముద్రించారు. ఈ కావ్యాన్ని అంకితం తీసుకున్న గోపకవి బాల్యమిత్రులు మేకల రాజారావు దంపతులు ముద్రణకు 4వేల రూపాయలు ఇచ్చారు. ఏకలవ్య సభా కార్యక్రమాలకు కాకాని శాంతయ్య, సలివేంద్ర ఆరోనురావులు సహాయం అందించారు. ఈ కావ్యంలోని భాషా మరియు భావ విశేషాలపై జేసుదాసు, రాజేశ్వరి దంపతులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ కావ్య రచన కోసం గోపకవికి కావాల్సిన పుస్తకాలు వెంపా జ్వాలా లక్ష్మీనరసింహారావు అందించారు. తెలియని పదాలకు అర్ధాలు మరియు తాత్పర్యదులను సెనగవరపు రామమోహన శర్మ తెలియజేశారు. ఈ కావ్య అవతారికలో గోపకవి తెలుగు భాష గొప్పదనాన్ని, కృష్ణానది మరియు అందులో నివసించే వివిధ రకాల చేపల గురించి పద్య రూపంలో వర్ణించారు. ఈ కావ్యంలో కవిస్తుతి పేరుతో పద గంభీరం, భావనా పటిమ కలిగిన సత్కవి గుర్రం జాషువా అని వారికి అనునిత్యం పుష్పాంజలి ఘటిస్తానని గోపకవి తెలియజేశారు.

కోకిల

విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా తన గబ్బిలం కావ్యం ద్వారా అస్పృశ్యతను ఎండ గట్టిన తర్వాత ఆ మార్గాన నడచి అనేకమంది అస్పృశ్యతను నిరసిస్తూ అనేక కావ్యాలు రచించారు. జాషువా గబ్బిలం మరియు మోదుకూరి జాన్సన్ కాకి కావ్యాలను ఆదర్శంగా తీసుకొని కొలకలూరి గోపకవి రచించిన పద్య కావ్యం కోకిల.1994లో రచించబడిన ఈ కావ్యం తన తల్లిదండ్రులైన గంగమ్మ, భిక్షాలకు అంకితమిచ్చారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాల, గుంటూరులో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసిన నేలటూరి కిషోర్ బాబు కుహు కారము పేరుతో ఈ కావ్యంలోని విశేషాలు తెలియజేశారు.
వాస్తవికత వైభవాన్ని వీనుల విందు చేస్తూ, అస్పృశ్యత, అంధకార జీవితాలలో నవ వేకువను పుట్టించాలని నాటి సామాజిక దురాగతాలపై జనులు నిరసించుటకు మరియు వారిని జాగృతం చేయుటకు గోపకవి ఈ కోకిల కావ్యాన్ని విరచించారు. ఆధునిక కావ్యాలలో సమస్యను మాత్రమే సూచించి పరిష్కార మార్గాన్ని తెలియజేసే కావ్యాలు తక్కువగా ఉన్నాయి. కోకిల కావ్యం సమస్యను గుర్తించి పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది. జనహితం పరమావధిగా సాగే ఈ కావ్యానికి నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు నందు ఆచార్యులుగా పనిచేస్తున్న గుజ్జర్లమూడి కృపాచార్యులు ముందుమాట రాశారు. గోపకవి మిత్రులు వావిలాల సుబ్బారావు ఉన్న మాట పేరుతో ఈ కావ్యం గురించి పేర్కొంటూ “గోపకవిని నిసర్గ కవిగా పేర్కొన్నారు.

కవితా ఆశీర్మంజరి

గోపకవి తన తండ్రిపై గల ప్రేమాభిమానాలను గౌరవభక్తి తత్పరతను పొందుపరచి పద్యస్తుతి చేస్తూ కవితా ఆశీర్మంజరి అను కావ్యాన్ని రచించారు.

ఉష ঃ శ్రీ

1983లో గోపకవి ఉషశ్రీ శతకాన్ని ఆట వెలదిలో రచించారు. “బాల భాను తేజ బాల రాజ” అను మకటంతో 112 ఆట వెలది పద్యాలతో రచించబడిన ఈ శతకం తాడికొండ సమితి కార్యాలయ అధ్యక్షులు మల్లెల శ్రీనాథ చౌదరి కోరి అంకితం తీసుకున్నారు. గద్దె వెంకటరత్తయ్య, కృష్ణకుమారి దంపతులు ఈ కావ్య ముద్రణకు సహాయం చేశారు.

ఉష ঃ శ్రీ శతక విశేషాలు

మహాకవి గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి, వెంకటరత్న కవులకు నమస్కరిస్తూ బాల్య దశలో అడుగుపెట్టిన పిల్లల ప్రగతి కోసం చక్కని సాహిత్యాన్ని, పద్యాల రూపంలో కూర్చి తెలుగుదనం ఉట్టిపడులాగున రేపటి పౌరులైన నేటి బాలలను ఉద్దేశించి రాసిన ఈ శతకంలో చిమ్మ చీకటిని చీల్చుకొని ఉషోదయ వెలుగులతో తెలవారుతుందని బద్దకాన్ని విడిచి నిద్దుర లేవమని పాఠశాలకు వెళ్ళుటకు అలక పూనవద్దని, సమయానికి పాఠశాలకు వెళ్లాలని, భక్తిశ్రద్ధలతో చదువు నేర్చుకోవాలని గోపకవి మేల్కొల్పారు. అలాగే పిల్లలను ఉద్దేశిస్తూ

ఆటపాటలందు నాసక్తి జూపక
చదువు సంధ్యలందు శ్రద్ధ లేక
సోకుమీరు వాడు సోమరిపోతురా
బాల భాను తేజ బాలరాజా

సోమరితనాన్ని విడచి చదువు సంధ్యలందు, ఆటపాటలలో పిల్లలు ఆసక్తి కలిగి ఉండాలని కవి ప్రబోధించారు. సూర్యుని ప్రచండ ప్రతాపానికి నదులు ఇంకిపోతాయని, భూకంపాల వలన కొండలు విరిగిపడతాయి గాని విద్యను ఇతరులకు బోధించే కొలది జ్ఞానం పెరుగుతుందని, గురువులు చెప్పే బోధను మరియు ఆటపాటలను శ్రద్ధ ఆసక్తులతో నేర్చుకోవాలని, చెడ్డ వారితో స్నేహం తగదని, మంచి వారి స్నేహం విడువ రాదని మరియు అందరి పట్ల మంచి భావం కలిగి ఉండాలని హితవు పలికారు కవి.
ఇరుగుపొరుగు వారితో ప్రేమ కలిగి ఉండాలని, ధనం ఎంత ఉన్నా గర్వపడకూడదని, పేరు ప్రఖ్యాతులు ఎన్ని ఉన్నా విర్రవీగరాదని తెలుపుతూ లోకంలో అమ్మ కన్నా మించిన ఆస్తి మరొకటి లేదని, భార్యకు మించిన తోడు లేదని, ప్రేమకు మించిన దైవం లేదని, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు లేనివారికి దేవుడే దిక్కని తెలియజేశారు గోపకవి.
ఆపద సమయంలో, అవసరమైన సమయంలో అక్కరకి రాని ధనము వ్యర్థమని, అవయవాలు లేని వారైనా, వయోవృద్ధులైన మరియు పనిచేయగలిగిన శక్తి ఉండి యాచన చేయుట తప్పని, చెడ్డవారికైనా హాని తలపెట్టరాదని, పేదవానిగా యాచన చేయరాదని, ఆత్మగౌరవమే అన్నిటికంటే గొప్పని, గుణహీనుని ఆశ్రయించి బాధలుపడ వద్దని, అయినవారిని విడచి హీనస్థితికి చేరవద్దని, కష్టనష్టాలు, కరువులు వచ్చినప్పుడు మరియు ఇరుకు ఇబ్బందులు కలిగినప్పుడు అయిన వారిని యాచించవద్దని, ప్రాణం ఇచ్చి పరువు నిలుపుకోవాలని, బట్టలు కొంచెం చినిగినప్పుడే దారంతో కుట్లు వేయాలని, ఎక్కువగా చినిగేవరకు ఆలస్యం చేయరాదని, ఆరోగ్య విషయంలో కూడా అధిక శ్రద్ధ వహించాలని కవి పలికారు. చేయని కార్యాన్ని చేసినట్లుగానూ, గోరంతలు కొండంతలుగా చేసి పంచభక్ష పరమాన్నాలను పొందుట కంటే కష్టపడి పనిచేయగా వచ్చిన గంజి నీళ్లు తాగుట మేలని, సాలెపురుగు ఎంతో ఓర్పు నేర్పులతో పోగు పోగులను కలుపుతూ తన గూడును అల్లుకుంటున్నట్లు పట్టుదలతో సాధన చేస్తే అసాధ్యమైన పనులేవి ఉండవని

తనకు మించు బరువు తగనీడ్చు కొని పోయి
దాచుకొనును చీమ ధాన్యములను
సంతరించుకొనుము సత్ఫలంబును ముందె
బాల భాను తేజ బాలరాజా”

అని గోపకవి హితవు పలికారు.
లోకానికి చల్లని వెలుగును, పండు వెన్నెలను ప్రసరించు చందమామలో సైతం మచ్చ ఉంటుందని, చిన్న లోపం లేని మనిషి ఈ భూమిపై లేడని, సూర్యచంద్రులు అనుదినం లోకానికి వెలుగునిస్తారని, మంచి వారి క్రియలు సంవత్సరాలు గడచిన వారు చేసే మంచి క్రియలలో మార్పు ఉండదని, కృష్ణపక్షంలో అలుముకున్న చీకట్లు, శుక్లపక్షంలో తరిమి వేయబడి వెలుగులు విరజిమ్ముతాయని కష్టాలు నష్టాలు దీర్ఘకాలం ఉండవని, సత్యవంతునికి చావు లేదని, అతని గొప్పతనం లోకంలో మాసిపోదని, తన బిడ్డల ఆకలి తీర్చి వస్తానన్న ఆవు నిజాయితీని ఆకలిగా ఉన్న పులి అర్థం చేసుకొని వదిలేసిందని పలుకుతూ

ఆడి తప్ప లేక నలహరిశ్చంద్రుండు
ఆలు బిడ్డల, తను నమ్ముకొనియె
సత్యమునకు బుడమి చావుండాబోదురా
బాల భాను తేజ బాలరాజా”

అని పురాణాలలో నిరూపించబడిన సత్యం యొక్క ఔన్నత్యాన్ని గోపకవి ఈ శతకంలో ప్రస్తావించారు.
అమ్మ, అరక, అరటి, అమృతం వంటి తేనెతో సమానమైన పదాలను కలిగిన తెలుగు భాష గొప్పదని, ఖండాలన్నిటిలో భారత ఖండం గొప్పదని భాషలన్నింటిలో తెలుగు భాష గొప్పదని, కట్టుబొట్టులో, కట్టుబాట్లలో, పిలుపులలో , ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండుటలో తెలుగువారికి సాటి ఎవరూ లేరని తెలుగు భాషను, తెలుగు నేలను ప్రస్తుతించారు కవి.
పురాణ ఇతిహాసాల గొప్పదనాన్ని, విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తుల గురించి తెలియజేస్తూ అన్నదమ్ములలో రామలక్ష్మణులకు, భార్యాభర్తలలో సీతారాములకు మించినవారు ఈ లోకంలో లేరని, భక్తి భావాలకు, పరాక్రమానికి ఆంజనేయుని మించిన వారు లేరని, యుద్ధానికి పంపే ముందు తన భర్తకు వీర తిలకాన్ని దిద్దిన వీర వనిత మగువ మాంచాలని, భర్త ప్రాణాల కోసం యమునిపై గెలిచిన సతీ సావిత్రి, పాతివ్రత్యంలో అనసూయ గొప్పదని, వివాహ సమయంలో భార్య భర్తలకు ఆకాశంలో చూపించే అరుంధతి గొప్పతనాన్ని , జాంబవతి, మేనక ల గొప్పదనాన్ని గోపకవి ఈ శతకంలో ప్రస్తావించారు.

తను తెరగి యిచ్చె దండమ్ము నందూచి
డేగ పావురమును మూగునెడల
చెప్పనేల త్యాగి శిబి చక్రవర్తి రా!
బాల భాను తేజ బాలరాజా”

అని శిబి చక్రవర్తి దాన గుణాన్ని ప్రస్తుతించారు గోపకవి.

శ్రీకృష్ణుడు, కుచేలుని చెరిగిపోని స్నేహాన్ని, తన కవచకుండలాలను ఇంద్రునికి దానం చేసిన కర్ణుని దాన గుణాన్ని, ద్రోణాచార్యుని చిత్రపటాన్ని గురువుగా భావించి నేర్పని విలువిద్యకు గురుదక్షిణగా తన బొటనవేలును దానం చేసిన ఏకలవ్యుని గొప్పతనాన్ని, తన తండ్రికి మళ్లీ వివాహం జరిపించి తను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన భీష్ముని ఔన్నత్యం గురించి, తల్లి కడుపులో ఉండి విని యుద్ధ విద్యలు నేర్చుకున్న అభిమన్యుని వీరత్వాన్ని మరియు భారతంలోని అనేక విశేషాలను సందర్భానుసారంగా గోపకవి ఈ శతక కావ్యంలో ప్రస్తావించారు.

భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, తెల్లవారిని ఎదిరించిన స్వాతంత్ర్య సమర యోధులను గురించి కవి ప్రస్తావిస్తూ

శిశువు మూపు నుండ శివమెత్తి చెండాడి
చెదరగొట్టె దొరల సిగ్గు పరచి
ఝాన్సీ లక్ష్మి పేరు చాటరా గడగట్టి
బాల భాను తేజ బాలరాజా”

ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వాన్ని ప్రస్తుతించారు గోపకవి. తెల్లవారి మర తుపాకులకు ఎదురు నిలబడి గుండె చూపి కాల్చుకోవోయి అని పోరు చేసిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యాన్ని, బుస్సీ దొర మోహన ఉమ్మి వేసిన బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు గొప్పదనాన్ని, అహింసను ఆయుధంగా చేసుకొని ఆంగ్లేయుల దాస్యం నుండి భరతమాతకు విముక్తి కలిగించిన అహింస మహాముని గాంధీజీ గొప్పదనాన్ని, శాంతిని ప్రబోధించి స్వతంత్ర భారత శ్రేయస్సును కాంక్షించిన జవహర్లాల్ నెహ్రూను గురించి ఈ శతకంలో గోపకవి ప్రస్తావించారు.అమరావతి శిల్పాలు, అజంతా గుహలు, తాజ్ మహల్ భారతీయ శిల్పకళకు ప్రతిరూపాలని కొనియాడారు. సాధ్యం కాని పనులను తలపెట్టి కోరి కష్టాలు కొని తెచ్చుకో రాదని, చీమలు ముందు జాగ్రత్తతో తమ శక్తికి మించిన ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటాయని కష్టపడితే ఫలితం దక్కుతుందని, అందరికీ ఆచరించమని సూక్తులు ప్రబోధించి, తాను పాటించకపోవడం తప్పని, వేష భాషలు మార్చినంత మాత్రాన విద్వాంసులు కాజాలరని సాధన, ప్రతిభ ఉండాలని, పెద్దలపట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలని ప్రబోధించారు.

పాప జనుల కొరకు ప్రాణాలు బలి జేసి
పూడ్చి పెట్టబడియు పుడమి మరల
బ్రతికి వచ్చినట్టు రక్షకుండే సురా
బాల భాను తేజ బాలరాజా”

అని ఏసు క్రీస్తు గొప్పతనాన్ని, ఆయన త్యాగాన్ని ప్రస్తుతించారు కవి.

అంతేకాక అవతారాలు వేరైనా ఆత్మ ఒకటేనని, కులమత విభేదాలు తగదని, బెత్తం వాడకపోతే చదువు సంస్కారాలు అలవాడవని, గుణహీనుల స్వభావాన్ని, పాడి పంటల గురించి, భగవన్నామ స్మరణ గురించి మరెన్నో సాంఘిక, పౌరాణిక, చారిత్రక అంశాలను, పాత్రలను, విషయాలను మరియు విశేషాలను కూర్చి ఈ శతకాన్ని కొలకలూరి గోపకవి అందించారు.తెలుగు సాహిత్య చరిత్రలో పద్య కవిగా ప్రత్యేక స్థానాన్ని పొందిన గోపకవి 17-5-1996 లో ధాన్యకటకంలోని ప్రసన్న సాహితీ నిలయంలో తనువు చాలించారు. మరుగునపడిన కొలకలూరి గోపకవి సాహిత్యం సాహిత్య ప్రియులకు అందాలని కోరుకుంటూ…….

అనిల్ కుమార్ దారివేముల
మాచర్ల, పల్నాడు జిల్లా
9951244718.

Post Comment

You May Have Missed

0Shares