సూర్యఘర్ తో ఇంటింటికీ సూర్యోదయం
రాజధాని వాయిస్: రెంటచింతల.అక్టోబర్ 18
పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఖర్చు తగ్గింపుసౌరశక్తి వినియోగంతోనే సాధ్యమవుతుందని, వనరుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి కుటుంబం సౌరశక్తి వినియోగాన్ని అలవర్చుకోవాలని మండల విద్యుత్ శాఖ ఏఈ షేక్ మస్తాన్ వలి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన రెంటచింతలలో స్థానిక విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ ఏర్పాటుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఉద్దేశించి ఏఈ మాట్లాడుతూ ప్రతి ఇంటికి సౌరశక్తి అందించి, విద్యుత్తు ఖర్చు తగ్గించటం తో పాటు పర్యావరణ పరిరక్షణ సాధించటం ప్రధాన ఉద్దేశంగా వనరుల అవసరం వినియోగాన్ని చాటిచెప్పటం లక్ష్యంగా పీఎం సూర్యఘర్ అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. సూర్యఘర్ పథకం అమలుకు ప్రోత్సాహంగా పునరుత్పాదక రంగానికి సూపర్ గిఫ్ట్ గా కేంద్ర ప్రభుత్వం పరికరాలపై 12 శాతం నుంచి 5 శాతం వరకు జీఎస్టీ ఇచ్చినట్లు తెలిపారు. సూర్యుడే మన శక్తి.. సౌరశక్తే మన భవిష్యత్తు, సూర్యరశ్మి తోనే జగతికి వెలుగు వంటి నినాదాలతో ర్యాలీ ప్రధాన రహదారి గుండా సాగింది. కార్యక్రమంలో స్థానిక విద్యుత్ సిబ్బంది, పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు.



Post Comment