సాహిత్యం ప్రత్యేకం…….తరాలకు ఖగరాజు హితోక్తి

 పద్య కవితా సుందరిని వశీకరించుకొని పద్య ప్రక్రియను పండించి, పరవశింపజేసిన కవుల్లో వినుకొండ కవుల స్థానం ప్రత్యేకం. వారిలో ఖగరాజు అను కలం పేరుతో క్రైస్తవ సంకీర్తనాచార్య అను బిరుదు పొంది సాహిత్య సేద్యం చేసిన వారిలో గద్దల శాంయూల్ ముఖ్యులు.

కవి పరిచయం 

వీరు డిసెంబర్ 10 తేదీ 1935 సంవత్సరంలో వినుకొండకు 13 మైళ్ళ దూరంలో గల గోకనకొండ గ్రామంలో గద్దల అబ్రహం, సంతోషమ్మ దంపతులకు జన్మించారు. కన్నీటి కబురు కృతికర్త గద్దల జోసెఫ్ వీరికి అన్నయ్య. ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనూ, గురజాల బోర్డు స్కూల్లో ఎస్ ఎస్ ఎల్ సి, ఇంటర్మీడియట్ విద్యను ఆంధ్ర క్రైస్తవ కళాశాల, గుంటూరు లోనూ, బాపట్లలోని బోర్డు మిషన్ ట్రైనింగ్ సెంటర్ నుండి సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ పూర్తిచేసుకొని అదే స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆదిమూలపు జార్జి కుమార్తె స్టెల్లా జార్జిని వివాహమాడి ఒక కుమార్తె ముగ్గురు కుమారులను సంతానంగా పొందారు. తదనంతరం బి ఏ, బి ఈడి పూర్తిచేసి పల్నాడులోని పలు పాఠశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. నటులు నాగభూషణం గారి రక్త కన్నీరు వంటి వివిధ నాటకాలలో ఉత్తమ పాత్రలు పోషించి పురస్కారాలు పొందారు. ఆధ్యాత్మిక చింతనతో అనేక క్రైస్తవ గీతాలు రాసి క్రైస్తవ సమాజానికి అందించారు. క్రైస్తవ ధర్మ దార్శనికతపై “ఆవలి తీరం” అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించి డాక్టరేట్ పొందారు.

సాహిత్య సేద్యం

 సహజంగా కవి పండిత కుటుంబంలో జన్మించుట, మహాకవి గుర్రం జాషువా సాంగత్యం వలన సాహిత్యం వైపు అడుగు వేసి ఖగరాజు కలం పేరుతో పద్యం, గేయం, వచనం మరియు అనువాద ప్రక్రియల్లో అందె వేసిన చేయి గా సాహిత్య సృష్టి చేశారు. వీరు ఏమి రాసినా అందులో ఆత్మ, అనుభవం, అనుభూతి, అనితర సాధ్యమైన అందం మరియు ఆధ్యాత్మిక బంధం ఉంటుంది.

పశ్చాత్తాపం, పాము- నిచ్చెన అను నాటకాలను, రాగోదయం, కనువిప్పు, బహుకృత వేషం అను నాటికలను, ఆంగ్లంలో ది జడ్జిమెంట్ అను నాటికను శృతగిరి అను యక్షగానాన్ని, సదానంద సంకీర్తనమ్ అను క్రైస్తవ భక్తి గీతాలను, విశ్వాస ప్రభావమ్ అను కథా సంపుటిని, ఆనంద సరిత అనువచన కవితా సంపుటిని మరియు హితోక్తి అను పద్య రచనను రచించారు.

హితోక్తి వైశిష్ట్యం

సర్వ జగత్తులో మనిషికి ఉన్న వరం మాట. మాటలు నేర్చిన జీవి మానవుడొక్కడే. మంచి మాటకారి అనిపించుకొనుటకంటే మితంగా మాట్లాడుతూ మాటను స్వాధీన పరచుకుంటూ మంచి మనిషిగా జీవించుటే ఉత్తమం. మనిషికి తన మాటను బట్టి విలువ ఉంటుంది. అటువంటి విలువైన మంచి మాటలను *హితోక్తి* అను పద్య కావ్యంగా మూటగట్టి ఒక గురువు తన శిష్యులకు అందించినట్లు, ఒక తండ్రి తన బిడ్డలకు అందించినట్లుగా ఖగరాజు ఈ కావ్యాన్ని సమాజానికి అందించారు.ప్రతి వ్యక్తి సన్మార్గంలో నడచి, సుజనునిగా తీర్చిదిద్దబడాలనే ఆకాంక్ష, ఆవేదనతో వారి అపార అనుభవం నుండి, ఆదర్శ జీవితం నుండి మరియు ఆచరణాత్మకమైన ఆలోచనా స్రవంతి నుండి జాలువారినది ఈ పద్య కావ్యం. అచ్చ తెలుగు పదబంధాలతో, నుడికారాలతో, పురాణ, ఇతిహాస మరియు చారిత్రక అంశాలతో సామ్యం చూపుతూ 115 పద్యాలతో రచించబడింది.1997 లో రచించబడిన ఈ కావ్యం గద్దల కృపావరదానం గారి సహాయంతో ముద్రించబడింది.

 శరీరం పంచుకొని పుట్టిన పిల్లలు ఉన్నత విద్యావంతులై, దినదిన ప్రవర్ధమానమై ఎదగాలని కోరుకునే తల్లిదండ్రుల మనసెరిగి ప్రవర్తించిన వారికి శుభం జరుగుతుందని, పరిణితి చెందని వయసుకు వచ్చిన పిల్లల కోరికలు ఆకాశాన్ని అంటుతాయని, మంచి చెడ్డలను ఆలోచించని వయసుకు వచ్చారని కవి పలికారు. వయసు మరియు కోరికలు పరస్పర విరుద్ధాలని, కోరికలు తీర్చుకొనుటకు వయసు సహకరింపదని ఈ కారణం వల్ల సంఘర్షణ చెలరేగుతుందని, యవనప్రాయంలో అడుగుపెట్టిన మీకు మేలేదో కీడేదో తెలియనట్లుగా లోకం తీరును తెలుపుతానని కవి పలికారు. కోరికలను సముద్ర అలలతో పోల్చుతూ

కడలి తరగలు కల్లోల గతిని లేచి

పతనమగుచుండు చిత్రమౌపగిది గాని

గడిచి చనబోవు చెలియలికట్ట దాటి

యటులె వాంఛలు చెలరేగి యణగు మదిన

సముద్రంలోని అలలు ఉవ్వెత్తున్న ఎగసిపడి ఏ విధంగా వెనుతిరుగుతాయో మనసులో కోరికలు కూడా అదే రీతిలో కలిగి చల్లారి పోతాయని ఖగరాజు పలికారు.

అపారమైన విద్యనభ్యసించడానికి సిద్ధమవుతున్న నీకు ఉపయోగపడే ధర్మాన్ని నీ మనసుకు సంతోషం కలిగేలా చెబుతానని, పెద్దలు నీతి వాక్కులు ఎన్ని విధాలుగా చెప్పినా ఆ మాటల విలువ పెరుగుతుందని అటువంటి హితవాక్కులు తేటగీతి, కందము మరియు ఆటవెలది పద్యాలలో తెలిపెదనని ఎవరు ఏమి చెప్పినా అందులో మంచి చెడులను ఆలోచించి మంచినే గ్రహించమని కవి పలికారు. వినయ విధేయతలు మనిషికి ఆభరణాలని, మంచి భావన కలిగి ఉండుటచే గౌరవింపబడతామని, సాధన చేయుట వలన ప్రావీణ్యత పొందుతామని కవి హితవు పలికారు. ఎదుటివారితో సఖ్యత కలిగి ఉండాలని, ఆటలలో న్యాయంగా వ్యవహరించాలని, మాటల్లో నేర్పు మరియు గురువుల పట్ల పెద్దలపట్ల మర్యాద కలిగి ఉండాలని కవి నొక్కి వక్కాణించారు.

గురుభక్తియు విద్యలపైతరుగని విశ్వాస సంపద వినయము,నిరంతర సాధన మరియు పునశ్చరణము విద్యార్థికి యవసర లక్షణముల్అని విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణాలను పై పద్యంలో పేర్కొన్నారు కవి.

కవి మాటను గురించి తెలియజేస్తూ మనిషి మాట్లాడే మంచి మాట శత్రుత్వాన్ని లేకుండా చేస్తుంది. మంచి ప్రవర్తన కీర్తిని కలిగిస్తుందని, మంచి కలిగి జీవిస్తే ఆయురారోగ్యాలతో మనిషి వర్ధిల్లుతాడని, మంచిగా మాట్లాడితే మర్యాద పొందవచ్చని, చెడ్డ మాటల వలన ఇబ్బందులు మరియు కష్టాలు కలుగుతాయనిపెదవి దాటి మాట పృధివిని దాటునుమంచి చెడుల గూర్చు మగుడరాదువిల్లు విడిన శరము వెనక్కుమరలునా?ప్రాణమ ధనమగునొ పతనమౌనొ!” అని మంచి మాట వలన కలిగే సత్ఫలితాలను, చెడు మాటల వల్ల కలిగే దుష్ఫలితాలను ఖగరాజు వివరించారు.ఛందస్సు పొదిగిన పదాలు మంచి పద్య మౌవుతుంది. రాగయుక్తంగా కూర్చిన మాటలు మంచి పాట అవుతుంది. సభలో వక్త పలికే మాటలు సభికులకు వీనుల విందౌతుంది. జ్ఞానులు మితంగా మాట్లాడతారు. విస్తారంగా మాట్లాడే వారి మాటల్లో దోషాలు మరియు తప్పులు దొర్లుతాయి. అటువంటి తప్పుడు మాటలు పదిమందిలో చెల్లవని కవి తెలియజేశారు. వేశ్య మాట మత్తును కలిగిస్తుందని, కాముకుని మాట ప్రేమను పొంగిస్తుందని, మంచివాని మాటలు గౌరవప్రదమైనవిగా ఉంటాయని, కృతజ్ఞత కలిగిన మాటలు గొప్పతనాన్ని సూచిస్తుందని, ముఖస్తుతితో మాట్లాడే మాటలు నీచమైనవని, ఉపేక్షతో కూడిన మాటలు కలహాన్ని రేపుతాయని, పొందిక కలిగిన మాటలు మంచిని నింపుతాయని కవి హితవు పలికారు.కఠినమైన మాటలు ఒకమారు జ్ఞానాన్ని, ఒకమారు కలతను కలిగిస్తుంది. గ్రహించుకునే మనసును అనుసరించి జీవితం సాఫీగా సాగుతుందని,

మాట పూజ్యమౌను మంజులమ్మై యొప్పి  మాట దూశ్యమౌను మట్టుదప్పినరయ మాటలో గుణాగుణమ్ములు పోల్చుగుణము చేత మాట గణుతికెక్కు”అని ఆహ్లాదకరమైన మాటల వలన మనిషి గౌరవింపబడతాడని, అదుపుతప్పిన మాటల వలన ఇక్కట్లు పాలవుతారని, మనిషి మాటలపై వారి గుణ గుణాలు ఆధారపడి ఉంటాయని, గుణం వలనే మనిషి మాట కీర్తింపబడుతుందని కవి మాట విలువను పేర్కొన్నారు.మాట్లాడేటప్పుడు పరిశీలన ఎంతో ముఖ్యమని, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వ్యక్తీకరణలోనే వ్యక్తమౌవుతుందని, ఆచితూచి మాట్లాడుట అవసరమని, ఆత్మ శాంతి కలుగుటకు మరియు మంచి-మమత పెంచుటకు మంచి మాట ఒకటి సరిపోతుంది. కమ్మని కోయిల పాట హృదయాన్ని పులకరింపచేస్తుందని కవి పలికారు. చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ శ్రద్ధ లేకపోతే చదువు అబ్బదని, చదువు లేకపోతే బ్రతుకు సాగదని, సజ్జనుల చెలిమి దొరకదని ఖగరాజు తెలియపరిచారు.

దానము అదుపులోనూ, ఖర్చు పొదుపు గానూ, చేయాలని క్రమశిక్షణ కలిగి ఉంటే మనిషి జీవితానికి ఘనత కలుగుతుందని, స్వార్థ చింతన విడిచిపెట్టకుంటే ధర్మ గుణాన్ని నాశనం చేస్తుందని, మనిషి తన స్వార్థం కోసం మంచివారికి సైతం హాని చేయుటకు వెనకాడని, బొగ్గు కోసం వటవృక్షాన్ని కాల్చుటకు వెనుకాడరని మనిషి స్వార్థం మానవత్వాన్ని కాల్చి వేస్తుందని, పరహితం పరమానందాన్ని కలిగిస్తుందని, అందరిని సమదృష్టితో చూసినవాడే ఆత్మ జ్ఞాని అని కవి ప్రబోధించారు.

విసపు తలపు లేవి విత్తిన మదిలోన

పాప వృక్ష మోవుచు పరిఢవిల్లు

పెద్ద చెట్టు క్రింద పెరుగునా పూతీవె?

లట్లె మంచి యెదుగ దట్టి మదిని

విషపూరిత ఆలోచనలు మనసులో నాటితే అది పాపమై పెరిగి పెద్ద వృక్షమౌవుతుందని పెద్ద చెట్టు నీడలో పూల తీగ ఎలా పెరగదొ అలాగే పాపం నిండిన మనసులో మంచి ఎదగదని చక్కటి సామ్యాన్ని కవి తెలియజేశారు.

వృక్షాలు ఫలాలనిచ్చినట్లు, మేఘాలు వర్షించినట్లు, భూమి సిరులు కురిపించినట్లు, ధర్మాత్ములు అడగకుండానే వరములు ఇస్తారని, పరోపకారం నిమిత్తం గోవులు పాలిస్తాయని, పువ్వులు తేనెలిస్తాయని, ఇతరుల మంచి కొరకు జీవితాన్ని అంకితం చేసినవారు కొనియాడబడతారు. జనుల పాపము క్షమించు నిమిత్తము ఏసుక్రీస్తు సిలువ మరణం పొంది నరులచే కొనియాడ బడ్డారని పరోపకారాన్ని గురించి కవి చక్కని సందేశమిచ్చారు.

సాధువులు తమకు నపకృతి సలుపు వారి

 కుపకృతి నెసల్పు చందురు కృపద లిర్ప,

తనను ఛేదించు వానికే తరుల యాచి

తముగ నీడను కల్పించి తన్పు రీతి

సాధు స్వభావం కలవారు తమను ఇబ్బంది పెట్టే వారికి సైతం మంచి చేస్తారని, అదే రీతిగా వృక్షం తనను నరికే మానవునికే నీడనిస్తుందని కవి ఈ పద్యంలో పలికారు.మితం హితమని కవి పలుకుతూ చల్లని గాలి అలసట తీర్చునని, అదే పెరిగి ఈదురుగాలై పెనుముప్పు కలిగిస్తుందని, ప్రేమ కూడా ఎక్కువైతే వెగటు పుడుతుందని మితంగా ఉన్నట్లయితే మేలు కలుగుతుంది. అమృతమైన( తీపి) అతిగా తాగితే మరణానికి కారణమౌతుందని, పరిమితంగా చేదునైనా తాగి జీర్ణించుకోవచ్చని మితంగా తీసుకుంటే ఏది హాని చేయదని అలాగే అత్యాశ మనిషికి మేలు చేయక కీడు కలిగిస్తుందని, మితంగా మాట్లాడటం వలన పూజించబడతారని మితాన్ని గురించి కవి హితవు పలికారు.నిజమైన స్నేహాన్ని గురించి చేతిలో ధనం ఉంటే స్నేహితులమంటూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు చుట్టూ చేరతారని, తేరగా దొరికే వాటిపై మనిషికి కోరిక ఎక్కువని కవి పలికారు. కష్టసుఖాల్లో కలిమిలేములలో విడవకుండా వెంట ఉండే వారే నిజమైన స్నేహితులని, స్నేహితుడు బోధకునితో, వైద్యునితో, రక్తసంబంధీకులతో సమానమని కవి ప్రబోధించారు.

మిత్రు లెందరున్న శతృ వొక్కని వలన

సంకటమ్ము లెన్నొ సంభవించు

పాలు సేయు నెంత మేలైన విసపు బొ

ట్టొకటి చాలు నసువు లూడ్చి వేయ

ఎంతమంది మిత్రులున్న ఒక శత్రువుని వలన అనేక ప్రమాదాలు సంభవిస్తాయని, పాలు ఎంత మేలు చేసినా వాటిలో ఒక బొట్టు విషం చేరితే చాలు ప్రాణాన్ని తీస్తుందని కవి ఈ పద్యంలో హెచ్చరించారు.బాధలో ఉన్న వారిపై ప్రేమ చూపి వారి బాధను పోగొట్టుటకు తమకు చేతనైన సహాయం చేయుటయే మానవత్వమని, తన స్వార్ధమే కాక సాటి మనిషి సౌఖ్యం కోరుటే మానవత్వమని, ధర్మబద్ధంగా సంపాదించిన చిన్నపాటి ఆస్తిపాస్తుల వలన శాంతి సమాధానం లభిస్తుందని, పిసినారి తాను సంపాదించి ఎవరికి దానధర్మం చేయక కూడబెట్టిన ఆస్తి “పాత్రలో పాచిపోయిన ఆహారం”తో సమానమని కవి చక్కని సామ్యాన్ని తెలిపారు. అలాగే తాను తినక దాచుకున్న ధనం, ధర్మాన్ని చూపని తత్వం, చెడు ప్రవర్తన వీడని దీక్ష, సభ్యత లేని హాస్య ప్రసంగాలు, ఆచరణ యోగ్యంకాని యాగం, శత్రువుని ఓడించలేని బలం, మంచి బోధించని మతం వ్యర్థమని కవి ఖగరాజు తెలియజేశారు.కులాల సృష్టి గురించి ప్రస్తావిస్తూ ఎవడో కులములను సృజించె వివేక హీనుడౌచు, చివరికి యీ నా వి దారుణ మారణ హోమ విధిన్ మానవత నెల్ల మలమల మాడ్చేన్” అని కులాలను ఎవరు సృష్టించారో గాని ఫలితంగా దారుణమైన విద్వేషాలు చెలరేగి, మారణహోమంలో మానవత్వాన్ని మంట కలిపారని, కులము మనిషిని పలు వర్గాలుగా విభజించి, నైతిక విలువలు దిగజార్చి అభివృద్ధికి నిరోధకంగా తయారై సమాజంలో విష బీజాలను నాటాయన్నారు. పెంట తినే కుక్క పిల్లను ముద్దాడుటకు ఇష్టపడతారు గాని వాని పక్కన కూర్చుండుటకు ఇష్టపడక దుష్ట బుద్ధి కలిగి కులం పేరుతో నిందిస్తారని అభివృద్ధికి నిరోధకమైన కుల వివక్షత ప్రమాదమని హెచ్చరించారు కవి.బలవంతులు బీదవారిని పట్టిపీడిస్తారని ధనవంతుల జోలికి పోరని అదేవిధంగా జోరిగ పశువు బలహీనతను ఆసరాగా చేసుకుని ఇబ్బంది పెడుతుంది. మనిషి తన పొరుగు వారిని ద్వేషించక ప్రేమించినప్పుడే జీవితం స్వర్గమయమౌతుందని దేవుడు ఎక్కడున్నాడొ అని వెతుకుట కంటే సాటి మనిషిలో సాక్షాత్కరించుకొన్నవాడు నిజమైన మనిషి అని ప్రబోధించారు కవి. ఏటి వాలు అనుగుణంగా ఈదుట సుఖమని, గాలి వాటం అనుసరించి సాగుట మంచిదని, సాలుకి తగిన రీతిగా దున్నాలని అలాగే ఎదుటి వారి మనసు తెలుసుకొని మసలుకోవాలని కవి హితోక్తి పలికారు. ఆత్మాభిమానం గలవాడు ఇతరుల నుండి గౌరవాన్ని కోరుకుంటారు. అలెగ్జాండర్ సైతం యుద్ధంలో ఓడిపోయిన పురుషోత్తముని గౌరవించారని కవి తెలియజేశారు. ఆత్మ బలం ఉంటే అవయవ లోపమున్నా ఓడిపోక విజయాన్ని సాధిస్తాడని కవి ప్రస్ఫుటం చేశారు.

కార్యశీలు డెట్టి కష్టమ్ములైన దా

నోర్చి కార్యసిద్ధి నొంద గలడు

హిమన గాగ్రమెక్కి యెత్త డా టెన్సింగు

జయపతాక మధిక శ్రమ సహించి?

 కార్యసాధకుడు ఎన్ని కష్టాలైనా ఎదురొడ్డి కార్యసిద్ధి పొందుతాడు. టెన్సింగు నార్కె ఎంతో శ్రమను సహించి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే జయ పతాకాన్ని ఎగురవేశారని కవి తెలియజేశారు. అలాగే మాట నిలకడ లేని మనుషుల్ని నమ్మి ఏదైనా కార్యసాధనకు పూనుకోవడం కోరి కష్టాలను తెచ్చుకోవడమేనని, ఎంత బలంగా ఉన్నా ఓటి పడవ ఎక్కి ఏరు దాటలేమని హితవు పలికారు కవి.

    చేయరాని పనులు చేయుటకు పూనుకోవడం, వగలాడిని నమ్మడం, రక్తసంబంధికులపై పగ పెంచుకోవడం మరియు బలవంతునితో తగవు పడడం మరణానికి నాలుగు మార్గాలని, ప్రాణం మీదికి వచ్చినా చేయకూడని పనులు చేయరాదని, చేయవలసిన మరియు చేయదగిన పనులు తప్పకుండా చేయాలని అదే ధర్మమని కవి స్పష్టం చేశారు. మనిషి మనుగడకు ధనం అవసరమే గాని అత్యాశ వలన ఆపద కలుగుతుందని, స్వర్ణ కంకణం పొందాలన్న అత్యాశతో కొలనులోకి దిగిన బాటసారి పులి వాతకు బలైనాడని కాబట్టి అత్యాశ మనిషి ప్రాణాలను సైతం తీస్తుందని హెచ్చరించారు కవి.

కాలం ఎవరికోసం ఆగదని, సమయాన్ని కనిపెట్టుకొని కార్యానికి పూనుకొని పూర్తి చేసి నట్లయితే అనుకున్న కార్యం పూర్తవుతుందని, విత్తనం గతించి మొక్క పుట్టి పెరిగి పెద్ద వృక్షమౌతుందో అలాగే మనిషి అహాన్ని వదలి వేసినప్పుడే ఘనత పొందుతాడని కవి స్పష్టం చేశారు. జ్ఞానం, కార్యసిద్ధి పొందాలనుకునే మనిషి నిద్ర, క్రోధం, బద్ధకం మరియు భయాన్ని దూరంగా త్రోసివేయాలని తెలియజేశారు కవి. వాన రాకను, ప్రాణం పోవుటను గురించి తెలుసుకోవచ్చు కానీ అనుక్షణం మార్పు చెందు చంచల హృదయుల మనసు తెలుసుకోలేము. కాలగమనంలో నీతి తప్పి లోకానికి కష్టాలను తెచ్చే వారిని నేడు లోకానికి మంచి చేసేవారిగా భావిస్తున్నారని, మహాత్ముని చంపిన గాడ్సే ని సన్మార్గునిగా పేర్కొంటున్నారని సమాజాన్ని కవి నిరసించారు. ప్రియురాలి వాలు చూపుకే ప్రియుడు తృప్తిపడతాడని, శిష్యుడు చేసిన అభివాదానికే గురువు సంతృప్తి చెందుతాడని, ఒక మంచి మాటకే స్నేహితుడు సంతోషపడతాడని అలాగే ఒక సత్కార్యానికే మంచివాడు సంతృప్తి చెందుతారని కవి పేర్కొన్నారు.

   స్నేహాన్ని గురించి తెలియజేస్తూ స్వార్థం, మోసం స్నేహానికి హాని కలిగిస్తాయని, నిస్వార్థం, శాంతం, మంచి నడవడికలు స్నేహాన్ని పదిలం చేస్తాయని, కపట పూరిత స్నేహం, యుద్ధంలో పిరికితనం, భక్తిలో మోసం, ధనం పై వ్యామోహం మనిషి పతనానికి హేతువులంటూ

ఎచట విశ్వాస ముండునో యచట ప్రేమ

వెలయు, నా ప్రేమ శాంతికి నిలయ మౌను,

శాంతి నెలకొన్నచోట నీశ్వరుడు నుండు

నతని సన్నిధియే స్వర్గమై తనర్చు

అని ఎక్కడైతే విశ్వాసముంటుందో అక్కడ ప్రేమ ఉంటుందని, ప్రేమ శాంతికి నిలయమని, శాంతి ఉన్నచోట భగవంతుడు ఉంటాడని అతని సన్నిధే స్వర్గమని కవి ప్రబోధించారు.దురాభిమానం కలిగి ఉండుట దోషమని, రోషం పగను పెంచుతుందని, పగ వలన శోకం కలుగుతుందని, శోకం వలన మనిషికి మానసిక అలసట పెరిగి జీవితమే ఆయాసకరమౌతుందని, తర్క వాదనలో ధర్మంగా వ్యవహరించినవారు శాంతి పొందుతారని శాంతంగా ఉన్న మనసు స్వర్గమౌతుందని, సజ్జనులతో సహవాసం, పండితులతో చర్చ, వైద్యునితో స్నేహం, ప్రియురాలి సన్నిధి మూడు లోకాలలో సాటి లేని ముఖ్యాంశాలని తెలియజేశారు కవి.సంపాదన కంటే ఖర్చు ఎక్కువైతే జీవితం కష్టాల పాలౌతుందని, ఖర్చు కంటే సంపాదన ఎక్కువగా ఉంటే జీవితం సంతోషకరంగా ఉంటుందని ప్రజల మీద బలవంతంగా రుద్ద బడిన ఏ సిద్ధాంతం నిలబడదని సామ్యవాదాన్ని కలగన్న రష్యా విఫలమైందని, యదార్ధంగా పాలించేవాడు బలమైన సంపద కలిగినవాడని, అటువంటి వారికి ఎలాంటి హాని జరగదని సముద్ర అలలు పర్వతాన్ని నిరంతరం తాకినను పర్వతానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని కవి పేర్కొన్నారు.కుకవుల, కుజనుల, పరదూషకులకు, చోరులకు, దొంగ స్వాములకున్, హంతకులకు, వేశ్యల, జారులకు కడుగు నెడమ్ముగా బ్రతికిన కూడును సుఖముల్అని నేటి లోకం తీరుని తెలియజేస్తూ సుఖవంతమైన జీవితం జీవించాలంటే హితోక్తి ని ఆచరించాలని ఖగరాజు తుది పలుకులు పలికారు. ఖగరాజు మిత్రులు అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రయత్నం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హితోక్తి కావ్యంలోని కొన్ని పద్యాలను ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చారు.

ముగింపు

వారు ఎక్కడ ఉన్నా చతురమైన సంభాషణలతో, మేధోపరమైన మరియు రసవత్తరమైన చర్చలతో శ్రోతలను, సభికులను రంజింపచేసేవారు. అచ్చ తెలుగు పదబంధాలు, సామెతలు, సామ్యాలు, నుడికారాలతో భావితరాలకు తెలుగు సాహిత్యాన్ని అందించి, సాహిత్య, నాటక, ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేసిన గద్దల శాంయూల్ (ఖగరాజు) 2006 జూన్ 1 వ తేదీన వినుకొండలో తనువు చాలించారు. ఖగరాజు మరణాంతరం వీరు రాసిన వచన కవితలను వీరి కుమారులు కవి, రచయిత గద్దల ప్రభాత్ కుమార్ శాం సేకరించి “ఆనంద సరిత” పేరుతో వచన కవితా సంపుటిని ముద్రించి, ఆవిష్కరించారు. మరుగునపడిన ఖగరాజు సాహిత్యాన్ని తిరిగి సమాజానికి అందించుటకు గద్దల ప్రభాత్ కుమార్ శాం చేయుచున్న కృషి, ప్రయత్నం సఫలీకృతమవ్వాలని కాంక్షిస్తూ…….

అనిల్ కుమార్ దారివేముల,మాచర్ల, పల్నాడు జిల్లా,9951244718.

Post Comment

You May Have Missed

0Shares