సాహిత్యం ప్రత్యేకం-

అనిల్ కుమార్ దారివేముల

రాజధాని వాయిస్ :

పీడితుల కన్నీటి కబురును అక్షరీకరించిన గద్దల జోసపు కవి

పద్య సాహిత్య ప్రక్రియలో రచనలు చేసి సాహితీ ప్రియులను రంజింపజేసిన వారిలో వినుకొండ కవులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరిలో కవిశేఖర, కవిరాజ, కవిమార్తాండ బిరుదాంకితులైన గద్దల జోసపు కవి చెప్పుకో తగినవారు.

జీవిత ప్రస్థానం
గద్దల జోసపు కవి 1908 జూలై 18వ తేదీన గద్దల జాన్ మరియు సంతోషమ్మ దంపతులకు వారి మాతామహుల ఊరైన వూరిమెట్ల గ్రామంలో జన్మించారు. వీరికి ఒక తమ్ముడు మరియు ఒక చెల్లెలు కలరు. వీరిది వినుకొండకు 13 మైళ్ళ దూరంలో గల గోకనకొండ గ్రామం. వీరు ప్రాథమిక విద్యను గోకనకొండ లోను మరియు నాగులవరంలో 8వ తరగతి వరకు చదివి బాపట్లలో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ పొందారు. తెలగలపూడి కమలమ్మను వివాహమాడి పద్మావతి అను కుమార్తెను సంతానంగా పొందారు. గోకనకొండలో ఉపాధ్యాయునిగా జీవితమారంబించి, ఇనుమెళ్ళ మరియు మంచికల్లులో పని చేసి తిరిగి స్వగ్రామమైన గోకనకొండలో 50 సెంట్ల స్థలంలో సొంతగా పాఠశాలను స్థాపించి చుట్టుపక్కల గ్రామాలలోని బీదలకు ఉచిత విద్య, వసతి గృహ సదుపాయమును అందించారు.

సాహిత్య ప్రస్థానం
వెల్లంకి సుబ్బయ్య శాస్త్రి, రాయప్రోలు చిదంబర శాస్త్రి స్నేహంతో సంస్కృత సాహిత్యాన్ని పఠించారు. గాంధీజీ హరిజనోద్ధారణ భావాలకు ఆకర్షితులై అంటరానితనానికి వ్యతిరేకంగా సాహిత్య సృష్టి చేసి చంద్రహాసం అనే కావ్యాన్ని పాతికేళ్ల ప్రాయంలో రచించారు. చంద్రహాసానికి ముందే జోసపు కవి 1931లో భారవి అను పద్య కావ్యాన్ని రచించారు కానీ ముద్రించే స్తోమత లేకపోవడంతో ఆ తరువాత వారి శిష్యులైన ఎడ్లపల్లి సాముయేలు కవి సలహా మేరకు కాళ్లూరు జమిందార్ రామకృష్ణరావుని కలిసి భారవి కావ్యాన్ని వినిపించగా వారు మిక్కిలి సంతోషించి వెయ్యినూటపదహార్లు ఇచ్చి ఘనంగా సన్మానించారు దాంతో భారవి ముద్రణకు నోచుకుంది. భారవి కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ పీఠిక రాస్తూ జోసపు కవికి గుర్రం జాషువా అంటే ఎనలేని అభిమానమని తెలిపారు.1945 డిసెంబర్ నెలలో హేలాపురంలో జరిగిన ద్వితీయ వార్షికోత్సవ సభలో రాయలసీమ కళాపరిషత్తు వారు జోసపు కవిని సత్కరించి, సన్మాన పత్రం ఇచ్చి కవి శేఖర అను బిరుదు ఇచ్చారు. 1946లో వీరు
రచించిన వసంతకుమారి అనుపద్య కావ్యానికి జమీందారు కాళ్లూరు ఉమామహేశ్వరరావు సహాయం చేయగా టంగుటూరి ప్రకాశం పంతులుకి అంకితమిచ్చారు. ఈ కావ్యానికి కట్టమంచి రామలింగారెడ్డి, దుర్భాక రాజశేఖర శతావధాని ముందు మాటలు రాశారు. జోసఫ్ కవి ఏసు భక్త విజయం, జానకి, భారతీయుడు, కథా గుచ్చము, కన్నీటి కబురు, కట్టమంచి, ప్రతిజ్ఞా భేరి, మద్యపాన నిషేధం, వేమన, తిమ్మరసు, హైదరాబాద్ నవాబు వంటి పద్య కావ్యాలను రచించారు.

కన్నీటి కబురు

కన్నీటి కబురు అను పద్య కావ్యాన్ని గద్దల జోసపు కవి 1943లో రచించి, బయ్యన్నగూడెం సంస్థానాధీశులు కొండపల్లి రామచంద్రరావుకి అంకితమిచ్చారు. వాణి ముద్రాక్షరశాల, బెజవాడవారు ఈ కావ్యాన్ని ముద్రించారు. విశ్వనాథ సత్యనారాయణ, కట్టమంచి రామలింగారెడ్డి ఈ కావ్యానికి పీఠిక రాశారు. భారతీయ సమాజంలో నిమ్న జాతుల స్థితిగతులు, వారి విషాదకరమైన జీవితాన్ని కరుణరస ప్రధానంగా మూడు అశ్వాసాలలో జోసపు కవి చిత్రీకరించారు.

మొదటి ఆశ్వాసం

అహోబిల కవి పలుకులు పోలినట్లు ధారాపాతముగా పారే గుండికా అనే చెరువు ఒడ్డున పూలవాడ అనే పేదఊరు ఆ ఊరిలో మాదిగ పల్లె ఉందని, పల్లెలోని ప్రతి ఇంటిలో దరిద్రపు దేవత వికృతంగా తాండవిస్తూ, పచ్చని కుటుంబాలపై కన్నెర్ర చేసి వారిని అష్ట కష్టాలు పెడుతుందని, పాడి పంటలు లేక, మురికి కంపు, దోమల హోరుతో, మంచాలలో నల్లులు, గుడ్లగూబల పరుగులు, ఎలుకలు ఇంటిలోని బూజుపై ఉయ్యాలలూగుతూ శనిదేవత తాండవిస్తుందని మాదిగ పల్లెలోని దయనీయ పరిస్థితులను వర్ణిస్తాడు. ఆ మాదిగ పల్లెలోని దరిద్ర దేవత చేత పీడించబడుటతో కంటికి నిద్ర లేక, దుర్మరణాలు పొందుచూ, దిన దినము ఒంటిలో రక్తం క్షీణిస్తూ, కూలి, నాలి చేసే పల్లె ప్రజలు జీవనం సాగిస్తున్నట్టు అస్పృశ్యత తాండవిస్తున్నట్లు తెలియజేశారు కవి. కాకులు మరియు గద్దలు అరుస్తూ, గబ్బిలాలు చికాకును కల్పిస్తూ వికారాన్ని కలిగించేలా పల్లె ఉందని, ఆకలి దప్పులతో, రోగాలతో, చీమల దోమల గోలతో చెప్పనలివి గాని తీరులో పల్లె ఉన్నట్లు మాదిగ పల్లె స్థితిని కన్నులకు కట్టినట్టు వర్ణించారు జోసపు కవి.

” గొప్పతనమున్న యలయగ్ర కులము వారు
మున్నుగా గొన్ని జాతుల ముఖ్య జనులు
నంట రానట్టివారు పురాంతరమున
నుండ జెల్లని వారని రొక్క మొగిని”

పూలవాడలోని అగ్రకుల పెద్దలు అంటరాని కులాలుగా వెలివేయబడిన వారు ఊరి లోపల ఉండరాదని తీర్మానించుకున్నట్లు ఈ సందర్భంలో కవి తెలియజేశారు.
దిబ్బడు అను మాదిగ పెద్ద తన కులవృత్తి అయిన చెప్పులు కుడుతూ, ఊరిలోని అగ్రవర్ణాల వారికి పనిచేస్తూ, మాదిగ కులస్తులను కనిపెట్టుకుంటూ అందరికీ తలలో నాలుకలా జీవిస్తున్నాడని, అతనికి రాయడు అను మగబిడ్డ జన్మించటంతో తన కొడుకుని చదివించాలని తలచి ఒంటరిగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడిని తన బిడ్డ అయినా రాయడుకి చదువు చెప్పమని, అందుకు ప్రతిఫలంగా మంచి కానుకతో పాటు తన చర్మం వలచి చెప్పులు కుట్టిస్తానని దిబ్బడు బ్రాహ్మణునితో చెబుతాడు. దిబ్బడు మాటలు వినిన బ్రాహ్మణుడు కన్నులు, చెవులు మూసుకుని కోపాన్ని ప్రదర్శిస్తూ పూర్వం చేయరాని తప్పులు చేయుట వలన ఊరి అవతల మిమ్మల్ని ఉంచారని, మీరు ఒకచోట స్థిర నివాసం ఉండరాదని, దేశ దేశాలు తిరిగి జీవనం సాగించాలని, మరణించిన వారి వస్త్రాలను ధరించాలని, వేదం వినరాదని, ఊరిలో రాత్రులు తిరగరాదని తెలియజేస్తూ, అనాదిగా వస్తున్న నీచ కార్యాలు మీకు బంగారు మేడలతో సమానమని, సరి చేయలేని దోషాలు మీ హక్కు అని, దురాచారాలు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన ఆస్తిపాస్తులు, నిరంతరం రెక్కలు ముక్కలు చేసుకోని పని చేయడం మీ నీతి అని హేళన చేస్తూ బ్రాహ్మణుడు పలుకుతాడు.

ఎంత యుండిన నీపూట నింటి యందు
పుల్లతిర్లిక వెలుతురు మల్లగంజి
మల్ల చుట్టు కొల్లారము పిల్లదండు
లేమి చేయను నీ శాప మిట్టునుండ

ఎంత కష్టపడి పని చేసినా మీ ఇళ్లల్లో గుడ్డి దీపపు వెలుగు, మల్ల గంజి, కలతలో నీ పిల్లలు ఉండుట నీకు కలిగిన శాపమంటూ, మీవంటి తక్కువ కులం వారికి చదువు చెబితే అగ్రకుల సమాజం నా ప్రాణాలు తీస్తారని, నీ కొడుకుకి చదువు చెప్పి నా ప్రాణాలు పోగొట్టుకోలేనని బ్రాహ్మణుడు దిబ్బడుతో పలికి ఇంటి బాట పట్టినాక దిబ్బడు బతుకు జీవుడా ప్రాణాలు దక్కాయి అనుకుంటూ చదివించాలన్న ప్రయత్నాన్ని విరమిస్తాడు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదని మారుతూ ఉంటుందని, రాయడుకి పెళ్లి వయసు రాగానే కులంలోని పిల్లని ఇచ్చి వివాహం చేసి దిబ్బడు మరియు అతని భార్య మరణిస్తారు.
రాయడు తనకు కలిగిన ఏడుగురు సంతానంలో దుగ్గి అను మొదటి కూతురికి మాతృభాష మీద అభిమానంతో చదువు చెప్పిస్తాడు. రాయడు గుణవంతుడు, తనకి కలిగిన దానికన్నా ఎక్కువ దానం చేయువాడు, ఆపద సమయంలో చింతించకుండా ఎల్లప్పుడూ సత్యాన్ని చెబుతాడని, ఎవరిపై ఆధారపడకుండా నైపుణ్యంతో, సృజనాత్మకంగా చెప్పులు తయారుచేసి భూస్వాములకు అందిస్తాడని, అతను చూపు ధైర్యం వలన పిరికివారు ధైర్యవంతులు అయ్యారని, అతని జ్ఞానం వల్ల అజ్ఞానులు జ్ఞానం పొందుతారని, అతని సహనం వలన చెడ్డవారు సైతం గుణవంతులయ్యారని, అతని శీలాన్ని, గుణాన్ని చూసి విజ్ఞులు సంతోషించే వారని, ఇక్కట్లు పడుతూ, ఇబ్బందులు పడుతున్న బీదవారిని చూసి తనకు ఉన్నది వారికి దానం చేస్తూ దయను, దాతృత్వాన్ని చాటుకున్నాడని రాయడు గుణ గుణాలను జోసపు కవి వర్ణించారు.

తాను వసియించు పల్లె చెంతను గలట్టి
యావర గ్రామమున బ్రాహ్మణాది జనులు
కులవిహీనుల గనినంత గోప పడుచు
గసరు చుందురు వారెంతొ ఘనుల పోల్కి

చుట్టుపక్కల పల్లెలలోని బ్రాహ్మణ మరియు ఇతర అగ్రకులాల వారు హరిజనులపై కోపపడుతూ, ఊరికి దూరంగా ఉంచడమే కాకుండా వారి సౌకర్యార్థమై పని కోసం వాడుకొనుచు, కుల మతాల పేరుతో కట్టుబాట్ల పేరుతో ఊరికి దూరంగా ఉంచేవారని కవి మాదిగల సామాజిక స్థితిని వర్ణించారు. నీటికి బదులు రక్తాన్నిచ్చి, మూడు పూటలా సాగు చేసి శ్రమ చేస్తూ భూస్వాములకు పంట పండించి ఇస్తారని, భూస్వాముల దయా దాక్షిణ్యాలతో మీరాసి హక్కుదారులై ప్రొద్దుగుంకులు కష్టపడుతూ కలత చెందకుండా వెట్టి చాకిరి చేస్తున్నట్లు దీనుల, కూలి జనుల కష్టాన్ని, వారి శ్రమను ఆవిష్కరించారు కవి. యజ్ఞ యాగాదులలో సిడి పెండ్లి కొడుకులా ప్రకాశిస్తాడని, కొలుపుల సమయంలో యజ్ఞంలో ద్రవ్యం వేయు మొనగాడు అవుతాడని, పాపాలు, తప్పులు సరిచేయు మాతంగికి సోదరునిలా వెలుగుతాడని, అన్ని విషయాలకు పెద్దతనై పెద్దరికనికి తలవంచి చివరికి మిగిలిపోయిన మెతుకులు తినడానికి వెనుకాడని స్థితికి నెట్టివేయబడతాడని పంచముని దీనావస్థను వివరిస్తాడు కవి. దిగువ స్థాయి వృత్తులకు ప్రతినిధి తానయ్యినా చివరికి పండిన పంటలో భూస్వాములు ఇచ్చే మేర లేదా మీరాసి మట్టి గింజలే అతనికి ఇస్తారని చెబుతూ

ఎన్ని కష్టాల బెట్టిన నెన్ను కొనక
కాపు గారికి కష్టంబు గలిగె నేని
కంటనీరును రాల్చు చింటింట దిరుగు
తనకు కీడేమో దాపరించిన విధాన

తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహించి, సర్దుకుపోతాడని తన యజమానికి కష్టం కలిగితే కన్నీరు కారుస్తాడని ఇంటి పాలేరు మరియు రైతు కూలీల వ్యక్తిత్వాన్ని కవి వర్ణించారు.

రాయడు తన జాతిజనులైన రైతు కూలీలను ఒకటిగా చేసి, రైతుల పొలాలలో పనిచేయ నిరాకరించుటకు అందరిని ఒప్పించుట, రాయడి మాటను అనుసరించి రైతుల పొలాలలో కూలికి వెళ్లకుండా ఉండుట, అగ్రవర్ణాల రైతులు కోపంతో రగిలిపోయి రాయడి ఆస్తి ఇతరులకు చెందునట్లు కుట్ర పన్నుట, రాయడు తనకు ఉన్న ధనాన్ని బీదవారైనా తన జాతి జనులకు ఇవ్వగా, కొందరు మోసగాళ్లు రాయడు ఆస్తిని హరించివేస్తారు. కాలక్రమంలో చివరికి తన పిల్లలకు తిండి లేక బిచ్చమెత్తినా కుటుంబాన్ని పోషించుకోలేక తన నుండి సహాయం పొందిన వారు సైతం సహాయం చేయకపోవడంతో రాయడి కుటుంబం నిస్సహాయతకు గురౌవుతారు. తగినంత వర్షాలు లేక పంటలు పండక, కరువు తాండవించగా ఊరు వదిలి వలస పోతే తప్ప ప్రాణాలు కాపాడుకోలేమని బంధుమిత్రులతో పలికి రాయడు కుటుంబం తో సహా పూలవాడని విడిచిపెట్టుటకు పూనుకుంటాడు.

వలస బోవను బొత్తిగ వాంఛ లేదు
గాని, విధిని జయంపశక్యంబు గాక
పోను వెనక ముందాడు చుంబరము వీడ
బ్రాణ మొప్పక యెట్టులో బయనమయ్యె

తన బంధుగణం ఎంతగా వారించినా వినకుండా, వలస పోవుట ఇష్టం లేకున్నా విధిని జయించలేక, తప్పనిసరి పరిస్థితుల్లో రాయడు వలస పోవుటకు సిద్ధపడుట, రాయడు బయలుదేరుతున్నప్పుడు వెళ్లవద్దని బంధుమిత్రులు ఎంత వారించినా వారందరికీ సర్ది చెప్పి కాలినడకన బయలుదేరి తన వెనుక వచ్చుచున్న బంధువులను హత్తుకొని బ్రతికి చల్లగా ఉంటే మరొకమారు కలుసుకుందామని బంధుమిత్రులను ఊరిని విడిచిపెడతాడు రాయడు. ఈ ఆశ్వాసంలో పదుగురి నోట్లో నాలుగా, కాలమొక రీతిగా ఎల్లకాలం ఉండదు, పరుగులెత్తి పాలు త్రాగుట కంటే నిలిచి నీరు త్రాగుట మేలు, విధిని జయింప శక్యంబు వంటి నుడికారాలను, జాతీయాలను సందర్భానుసారంగా పాత్రలతో పలికించారు జోసపు కవి.

రెండవ ఆశ్వాసం

ఎర్రటి ఎండలో రాయడు తన భార్య బిడ్డలను తీసుకొని కాలినడకన నిస్సహాయ స్థితిలో పూలవాడను విడచి, తినడానికి తిండి లేక అడుగులు తడబడుతూ, నెత్తురు చుక్కలేని మొహాలతో కొంత దూరం నడచి సేదతీరి నడక మొదలు పెట్టారని

కడుపు చిచ్చున నలిదేరు బుడత గమికి
యన్న మొసగిన మంట చల్లారు గాని
శాంత వచనంపు కథ లెన్నిసార్లు సెప్పి
బుజ్జగించిన లాభంబు పొసగ గలదె

ఆకలితో అలమటిస్తున్న చిన్న బిడ్డలకు అన్నం పెడితే ఆకలి తీరుతుంది గాని నీతి కథలు ఎన్ని చెప్పినా ఫలితం ఉండదని కవి ఈ సందర్భంలో తెలియజేశారు. ఎత్తుకొనకపోతే బొత్తిగా నడవలేని స్థితిలో బిడ్డలు ఉన్నారని వారి ముఖం చూస్తే కడుపు లోని పేగులు తరుక్కుపోతున్నాయని, తిండి తినకపోవడంతో రాయడు తన పిల్లల్ని ఎత్తుకోలేని స్థితిలో ఉన్నాడని, ఆకలి బాధతో కాళ్ల నొప్పులతో నడవలేక సుడివడిపోతున్నారని దప్పికతో నోరు ఎండిపోయి, వడగాలి వలన మిక్కిలి బాధతో అల్లాడిపోతున్నట్లు వలసబాట పట్టిన రాయడు కుటుంబ దయనీయ స్థితిని కవి వర్ణించారు. సర్దుకొని పోవడానికి ఒకరో ఇద్దరో కాదు ఏడుగురు పిల్లల్ని మోయలేక మోస్తూ చెట్టు వద్ద, గట్టు వద్ద ఆగుతూ సాగుతున్నారు రాయుడి కుటుంబం. తల్లిదండ్రుల కష్టాన్ని, తనయుల కష్టాల్ని ఒకరినొకరు చూసుకోలేక నడకలో నిమగ్నమయ్యారు. సంతోషంలోనే కాక, కష్టాలలో కూడా పాలుపంచుకుంటున్న రాయడి భార్య మరియు పిల్లలు ఎంత ధన్యులు అని జోసపు కవి పలికారు. అలసట బడలిక తీరుటకు చెట్టు దగ్గర సేదతీరుతూ, పొద్దు పుచ్చుతూ కొంత విశ్రాంతి తీసుకుని బిడ్డల్ని బతిమాలుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు రాయడు. పొద్దు పడమట దిక్కున వాలిపోగా రాయుడి భార్య వారధిని ఈదలేక నట్టడివిలో చిక్కుకున్నారని, చిమ్మ చీకటిలో అడవిలో చిక్కుకున్న రాయడి తన కుటుంబాన్ని నిద్రపుచ్చి గత కాలంలో తాను అనుభవించిన ఆనందకరమైన జీవితాన్ని, ప్రస్తుతం తాను పడుచున్న అగచాట్లను గురించి ఆలోచించుచుండగా రాయడి భార్య మృత్యువు ఒడిలోకి చేరుకుంటూ ఉండగా రాయడు తన భార్యను ఒడిలోకి చేర్చుకొని కన్నీరు మున్నీరౌతూ చేతులు జోడించి గద్గద స్వరముతో తన భార్య చివరి మాటలు వింటూ సంభాషిస్తాడు. మరణపు ఒడిలో తాను ఉన్నానని, అమాయకులైన బిడ్డలను ఉపాయం కొద్ది జాగ్రత్తగా పెంచమని, ఎంతటి కష్టం వచ్చినా వారిని నిందించక పెంచమని నీవు తప్ప వారికి దిక్కెవరు లేరని తాను ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే తిరిగి చేరుతున్నట్లుగా చెబుతూ చనిపోతున్నందుకు తనకు ఎలాంటి భయము, దిగులు లేదని ముందు ముందు మీకు ఎన్ని ఆపదలు వస్తాయో అని, ఆనంద సమయంలో రాయడు చూపిన ప్రేమ, కష్ట సమయాల్లో చూపిన కరుణ మరియు సహనం, స్వజాతీయుల కష్టాలు తీర్చుటకు రాయడు పడిన శ్రమ, ధర్మం కోసం తన శరీరాన్ని ముక్కలు చేసుకున్న తీరును స్వర్గంలో వీరమాతలతో కలిసి పాడుకుంటానని, జన్మజన్మలకు నీకు సహ ధర్మచారినిగా ఉంటానని రాయడి భార్య అతనితో చివరి మాటలు పలికిన విధానాన్ని కవి వర్ణించారు. బంధువులను, ధనాన్ని కోల్పోయి భూస్వాములకు విరోధి అయి, స్వజాతీయుల దుఃఖాన్ని పోగొట్టుటకు స్వజనుల మద్దతు మరియు సహకారం లేక ఇలా అడవుల పాలయ్యామని, రాయడి చేతిలో చేయి వేసి, కన్నబిడ్డలను కలియ చూసి తన ప్రేమను వారిపై కుమ్మరించి ఆమె కన్ను మూస్తుంది. రాయడి కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తొలగించు వారు లేక చిన్న బిడ్డలు తల్లి మృతదేహంపై పడి ఏడ్చిన హృదయ విదారక దృశ్యాన్ని జోసపు కవి చిత్రించారు.

బుస దొరంగిన నరుడు ప్రపూజ్యుడైన
ఒక నిమేషము గీములో నుంచరనెడి
పలుకునకు సాక్ష్యమనగళేబరము మన్ను
జేసి రానిశి, విధి విధి జెనయు నెవడు

తుది శ్వాస విడిచిన మనిషి ఎంతటి గొప్పవాడైనా ఒక్క నిమిషం ఇంట్లో ఉంచరన్నట్టు రాయడి భార్యను మట్టి చేసి బిడ్డలతో ముందుకు సాగాడు. భార్య మరణం ఒకపక్క, కాళ్ళ తీపులతో కదల లేక, మాట్లాడలేక తప్పని పరిస్థితిలో రాయడు తిరిగి ప్రయాణమై సాగిపోతుండగా మార్గం మధ్యలో పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్లిందని, ఆకలౌతుందని, ఇంకా ఎంత దూరమనీ, మేము నడవలేము ఎత్తుకోమని ఏడ్చుచుండగా రాయడు కోపంతో విచారించుచు ఏకాకిగా మిగిలిపోయినట్లు కవి రాయుడి బాధను వర్ణించారు.
ఈ బాధల నుండి ఎట్లా విముక్తి పొందాలని మనసులో అనుకుంటూ రాయడు పిల్లలందరినీ వెంటబెట్టుకుని రాజపురి అనే ఊరికి చేరతాడు. అక్కడి ప్రజలు మాటి మాటికి ఎక్కడ నుండి వచ్చారని అడిగే అనుమానపు ప్రశ్నలు ఒకవైపు, భార్య మరణం మరోవైపు రాయడి మనసుని కలచివేసింది.
తమ ఆరాలు అడిగిన రాజపురి ప్రజలకు రాయడు తమ గురించి చెబుతూ క్రిమి కీటకాలు తిరిగే మురికి కాలువల వద్ద నివాసం ఉండేవారని, చెప్పులు కుట్టుతూ, చేతి వృత్తులు చేసుకునేవారమని, అనుదినం దరిద్రపు దేవత మా ఇళ్లలో తాండవించేదని, జాంబవంతుని వంశంలో పుట్టిన పెద్ద ఇంటి వారమని, అంటరానితనముతో కృశిoచుకుపోయిన మాదిగ కులానికి చెందినవారమని, ఊరిలో వర్షాలు లేక, పంటలు పండక బతుకుదెరువుకు ఈ ఊరికి వస్తుండగా తన భార్య మరణించిందని మిగిలిన పిల్లలతో ఈ ఊరు వచ్చామని రాయడు తెలియపరచగా వారి దయనీయ స్థితికి జాలి పడక మోహాలు చిట్లించుకొని, చికాకు వ్యక్తం చేశారని కవి రాయడి దీనస్థితిని వర్ణించారు. పిల్లలకు సరిపడినంత ఆహారం దొరకక ఆ ఊరిలో ఒక పిల్లవాడిని జీతానికి ఉంచి మిగతా వారు హేమచంద్రపురం అను గ్రామానికి చేరుకున్నారు.

కాటి సామీప్యమందు మకాము జేసి
అన్నమాపురమంతట యడుగుకొనుచు
బిడ్డలందఱ బ్రేమాన బెంచుకొనుచు
జీవయాత్రను నెట్టులో జేయుచుండె

స్మశానం దగ్గర నివాసం ఏర్పాటు చేసుకుని ఇంటి ఇంటికి తిరిగి భిక్షాటన చేస్తూ, బిడ్డలను చూసుకుంటున్న రాయడి జీవితంలో మరొక ఉపద్రవం తొంగి చూసింది. ఒకానొక రాత్రి విపరీతమైన మబ్బులు కమ్మి కుండపోత వర్షం రావడంతో వర్షానికి భయపడి ఒక గోడ పక్కన రాయడి పిల్లలతో సహా తలదాచుకొనగా నానిపోయి ఉన్న గోడ కూలిపోయి రాయడు మరియు దుగ్గి తప్ప అందరూ మిగిలిన పిల్లలు మరణిస్తారు. భార్య మరణాన్ని జీర్ణించుకోకముందే కన్న బిడ్డలు మరణించడంతో పుట్టెడు శోకంలో మునిగిపోయాడు రాయడు.

ఇచ్చోటనే గదా యే మానవుండైన
స్థిర సౌఖ్యముల తోడ జిందులాడు
ఇచ్చోటనే గదా యే విభేదము లేక
సమధర్మ దేవత సంచరించు
ఇచ్చోటనే గదా యే యంటు దోషంబు
దీoడ్రింపలేమికి దిగులుసెందు
ఇచ్చోటనే గదా యే విచారము లేక
పరతత్వ భాగ్యంబు పంట పండు

ఈ స్మశానంలోనే ఎలాంటి మనిషైనా స్థిరమైన సౌఖ్యంతో ఉంటాడని, ఏ భేద భావాలు లేక ఇక్కడ సమధర్మం ఉంటుందని, అంటరానితనానికి స్థానం లేదని, ఎవరికి ఎటువంటి విచారం లేక స్వర్గానికి చేరుటకు ఇది సోపానమని, ఎంతటి వారైనా మరణించి చివరకు ఇచ్చటకు రావాల్సిందేనని స్మశానాన్ని గురించి వర్ణించారు అంతేకాక స్మశానాన్ని గురించి కాళిదాస కవి పొంగించిన భావామృతంతో సంతోషించిన ధన్య భూమి అని, శ్రీకృష్ణ దేవరాయలు కీర్తి కి స్వాగతం పలికిన వజ్ర నగరు అని, రెడ్డి రాజుల పన్నీట మునిగిన పుణ్యముల పంట అని, జన్మ సార్ధకమైన ప్రశస్త భూమి అని స్మశానాన్ని గురించి వర్ణించారు కవి. మరణం ఒకటి ఉందని తలంచకుండా ఎన్నో ఆస్తిపాస్తులను కూడబెట్టి పిల్లి కి కూడా బిక్షం పెట్టని అజ్ఞానుల సమాధులు ఇచ్చట మూలుగుచున్నాయని, ఈ స్మశాన వాటిక లలో ఎన్ని దేశాలను ఏలిన రాజుల పుర్రెలు ఉన్నాయో, ఎన్ని యుద్దాలలో గెలిచిన యోధుల ఎముకలు ఉన్నాయో, ఎన్నో ఇబ్బందులు భరించిన కష్టజీవుల గ్రంధులు ఉన్నాయో, ఎందరు పిసినిగొట్టుల తలలు ఉన్నాయో లోకంలో ఏనాటికైనా కాటికి పోని వారు ఉండరని కవి స్మశానం గురించి వర్ణించారు. అంతేగాక స్మశానాన్ని సామాన్య జన వ్యవహారంలో గల బొందల గడ్డ అనే పదాన్ని, పిల్లికి బిక్షం పెట్టని, వదనంబుల నెత్తురు చుక్కలేక, ప్రేవులు తరుక్కుపోవుట వంటి జాతీయాలను, లోకోక్తులను ప్రయోగించారు జోసపు కవి. గుర్రం జాషువా రచించిన తొలిఖండకావ్యంలోని స్మశానవాటిక పద్య కవిత లోనూ, జోసపు కవి రచించిన కన్నీటి కబురులోనూ మరియు బీర్నీడి ప్రసన్న కవి రచించిన పృథ్వి భాగవతంలోనూ స్మశాన వాటికను వర్ణిస్తూ ఒకే రకమైన సీస పద్యాన్ని, అర్థం వేరుగా రచించారు.

మూడవ ఆశ్వాసము

ఆ ఊరిలో రాయడు ఇంటి ఇంటికి తిరిగి బిచ్చమెత్తుకుంటూ దొరికిన రోజు తింటూ లేనిరోజు పస్తూ ఉంటూ, ఓ పక్క భార్య మరో పక్క పిల్లల మరణంతో తల్లడిల్లుతూ మిగిలిన కూతురు దుగ్గి ఒక్కటే రాయడుతో పాటు ఉంటుంది. అర్ధరాత్రిలో తల్లి గుర్తుకు వచ్చిన దుగ్గి అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉలిక్కిపడుట, రాయుడు దుగ్గిని ఎత్తుకొని ఓదార్చుట పరిపాటి అయింది. ఒకరోజు వంట వండుటకు కట్టెల కొరకు అడవికి వెళ్ళిన రాయడికి గొడ్డలి జారి కాలికి తగిలి రక్తం కారుతూ, ఇంటికి వచ్చేలోపు మతిస్థిమితం కోల్పోతాడు. ఆ స్థితిలో తండ్రిని చూసిన దుగ్గి తండ్రికి సపర్యాలు చేయుట, తన స్థితికి దిగులు చెందుతూ ఏడుస్తున్న దుగ్గిని ఓదార్చుతూ రాయడు దారిలో మీ అమ్మ, తమ్ముళ్లు మరియు చెల్లెలు మరణించారని ఇటువంటి పరిస్థితుల్లో నీవేమైపోతావో అని రాయడు విచారాన్ని వ్యక్తం చేస్తూ శత్రువులు దేశంలో రాకుండా గంగా సింధు నదులు మరియు హిమాలయాలు మన భరతభూమిని కాపాడుతున్నాయని, వీరులను కనిన భూమి అని భారతదేశ గొప్పతనాన్ని రాయడి పాత్ర ద్వారా చాటించారు కవి. శాలివాహనుల ప్రతిష్ట, చోళుల ప్రతాపం, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణ యుగం, పల్లవుల కీర్తి, కాకతీయుల వీరత్వం, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కావేరి, కృష్ణ నదులను కీర్తిస్తూ తెలుగు నేల ఖ్యాతిని, ఆంధ్రుల పరాక్రమాన్ని ప్రస్తుతించారు కవి.

“వ్యాసమహర్షి వేదములనల్లి కులాలకు లేనిపోని యా
యాసము దెచ్చి పెట్టెనని యందుర సత్యము నిక్కువంబె? తా
రాసికి నాల్గుజాతులని వ్రాసె గదా మఱి నీచ జాతిగా
గాసిలుచున్న యైదవ తెగ సమకూర్చిన పెద్దలెవ్వరో”
వేదాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాలుగు తెగలుగా మనుషుల్ని పేర్కొన్నారు కానీ ఐదవ జాతిని ఏర్పరచిన పెద్దలు ఎవరు అని పలుకుతూ, చేసే పనిని బట్టి, చేతి వృత్తిని బట్టి మరియు కులవృత్తిని బట్టి నీచులుగా, అధమ కులాలుగా భారతీయ సమాజం విడగొట్టబడిందని పలుకుతూ, ఈ భరత భూమిలో అంటరాని కులాలుగా పిలవబడుతున్న మాలా మాదిగలు ఒక్కటిగా మెలగడం అగ్రకులాల వారికి కండ్లల్లో కారం పోసినట్లుగా ఉంటుందని భారతీయ సమాజ పోకడను వివరిస్తాడు కవి.
సిలువలో మరణించిన ఏసుక్రీస్తుని నమ్మి కొందరు అమెరికన్ దేశీయులు త్యాగశీలురుగా మారి తక్కువ కులాల వారిని ఆదుకొని, విషాదాన్ని తొలగించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారని రాయడు దుగ్గితో చెప్పగా రాయడి కంటినీరు తుడుస్తూ, మనలను మనుషులుగా చూసి మనపై కరుణ చూపే వారు ఎవ్వరు లేరా అని దుగ్గి తన తండ్రిని ప్రశ్నించగా అందుకు రాయడు భారతదేశములో గాంధీ మహాత్ముడు జన్మించి అహింస మరియు సత్యాగ్రహంతో ఎందరినో తన శిష్యులుగా మార్చారని హరిజనుల కొరకు ఎందరో కృషి చేశారని వారిలో తెలుగు భాష కొరకు కృషి చేసి, హరిజనోద్ధరణ కొరకు ప్రాణాలు అడ్డువేసిన కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, బీర్నిడి మోషేకవి, కంచర్ల హనుమంతకవి, రామకృష్ణ కవి, రాజచంద్రమణి సీతారాములను ధ్యానించమని, శ్రీకృష్ణదేవరాయల పరాక్రమం, కీర్తి, పరిపాలన మరియు భాష సేవను గూర్చి ప్రస్తావించటం, దుర్బాక రాజశేఖర విద్వత్ కవి గురించి, తిక్కవరపు రామిరెడ్డిని దర్శించమని, కోట సుబ్రహ్మణ్య రంగ సత్య కవులతో మాట్లాడమని, గుర్రం సుబ్బరాయకవికి భావంతో నమస్కరించమని, దేవరపల్లి కోటమాంబ కుమారుడైన కృష్ణ ధరపాలుని సన్నిధికి వెళ్ళమని, తూములూరి శివరామ వధాన్యుని ప్రజ్ఞను చూడమని, భట్టిప్రోలు సూర్యప్రకాశ ప్రభువుని తలచుకోమని, తెలుగు తల్లికి విశేష కీర్తిని సంపాదించి పెట్టిన విశ్వనాథ సత్యనారాయణను, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిని దర్శించుకోమని, తెలికిచెర్ల ప్రకాశం సంస్థకు వెళ్ళమని, అయ్యంకి వెంకట రమణయ్య సంస్థానాన్ని దర్శించుకోమని, గూడూరి రామచంద్ర విభూని అర్థించమని, విమర్శ కా గ్రేసుడు తాపీ ధర్మారావుని గురించి తెలుసుకోమని, కులభేదం లేని కరుణ సంపన్నుడు బందా సూర్యనారాయణని తలచుకోమని, దేవులపల్లి కృష్ణశాస్త్రి పద్యాలు చదవమని, జయపురమును పరిపాలించు విక్రమ దేవవర్మ రాజుని దర్శించుకోమని, కొత్తపల్లి వెంకట రామలక్ష్మీనారాయణ శర్మను చూసి వారిని కీర్తించమని, కొండపల్లి గోపాల దయా స్వరూపి దివాణం చేరి వారి కరుణను పొందమని, నెల్లుట్ల శ్రీరామకృష్ణ కవిని కలిసి వెళ్ళమని, కాల్లూరి ఉమామహేశ్వరుని, రామకృష్ణుని, కొండపల్లి రామచంద్ర ప్రభుని దివానమును దర్శించమని, హరిజనులకు వరములిచ్చుటలో మేటి హరి రామలింగ శాస్త్రి ని కలువమని, దేశభక్తుడు మరియు కవి శ్రేష్టుడు కోటగిరి వెంకట కృష్ణ విభుని దర్శించుకోమని, బహుముఖ ప్రజ్ఞాశాలుడు, తెలుగు జెండా ఎత్తి దేశ దేశాలలో తెలుగువారి ఖ్యాతిని, తెలుగు దేశపు చరితను చాటి చెప్పిన కట్టమంచి రామలింగారెడ్డిని కలవమని, కుల మత భేదాలు లేని జ్ఞానవేత్త తల్లవజ్జుల శివ శంకర శాస్త్రి గారిని కలవమని, కొప్పవరపు కవుల దివ్య దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం పొందమని, బుచ్చిరామకవిని, నూతక్కి రామశేషయ్యను, రాయప్రోలు సుబ్బారావుని కలసి వరాలు పొందమని, శ్రీనాథ కవి సార్వభౌముడు తిరుగాడిన పలనాటి సీమను, రెడ్డి రాజులు పాలించిన కొండవీడును, బౌద్ధమతం వెలసిల్లి వేల మంది దేశ విదేశీయులు విద్యను నేర్చుకున్న నాగార్జున కొండను దర్శించమని రాయడు తన కుమార్తె దుగ్గితో పలుకగా

అనుడు జనకుని సలహాల విని మరింత
బొగిలి మన జాతిమరి యెట్లు దుగదముడిగి
వన్నె వాసిని గడియించి పదుగురి వలె
బ్రతుకు దురటంచు ప్రశ్నింపబలికె తండ్రి

తండ్రి మాటలు వినిన దుగ్గి అందరిలా మన జాతి జనులకు కూడా గొప్పతనాన్ని పొంది జీవించుటకు ఏమి చేయాలి ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని తండ్రిని అడగగా దానికి రాయడు సమాధానంగా గాంధీజీ లాగా దేశం కోసం అనేకమంది పోరాటం చేసి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని సంపాదించేంతవరకు మన జాతికి కష్టాలు తప్పవని జ్ఞానబోధ చేసిన తండ్రి వద్ద
జ్ఞానాన్ని సంపాదించి కన్నుమూసిన తండ్రిపై పడి దుగ్గి విలపించుటతో కావ్యం విషాదాంతంగా ముగుస్తుంది. సందర్భానుసారంగా పట్టిందల్లా బంగారము, కళ్ళల్లో కారం పోసినట్లు వంటి జాతీయాలను, నానుడలను కవి పాత్రల ద్వారా పలికించారు.

తెలుగు సాహిత్య చరిత్రలో పద్య సాహిత్యాన్ని సాహిత్య అభిమానులకు అందించిన గద్దల జోసపు కవి 1971 ఆగస్టు 15 వ తేదీన గోకనకొండలో మరణించారు. అర్థ శతాబ్దికి పూర్వం అపూర్వమైన సాహిత్యాన్ని అందించి మరుగున పడిన జోసపు కవి మరియు వారి సాహిత్యం తిరిగి నేటి సమాజానికి అందాలని ఆకాంక్షిస్తూ

అనిల్ కుమార్ దారివేముల
మాచర్ల, పల్నాడు జిల్లా.
9951244718

Post Comment

You May Have Missed

0Shares