యేసుక్రీస్తు జననం
రాజధాని వాయిస్:డిసెంబర్ 24
పాపి తప్పు దిద్ది పాపము క్షమియింప
పరము నుండి దిగెనె పావనుండు
కన్య గర్భ మందు కరుణామయుడు యేసు
మరియ సుతుడు తానై మహిన వెలిసె
ఇలను ఏలు ఱేడు ఇమ్మానుయేలుగా
ధాత్రి లోన దాల్చె నరుని రూపు
పతిత పావనుండు పాపరహితుడేసు
సత్య సరని జూపు సతతమతడు
మనువుకాయ మాయె మరియ యోసేపుకు
ఏక మవ్వకుండ ఎడమ నుండె
గాబ్రియేలు దెలిపెకన్నె మరియకును
గర్భ మొందు వన్న గొప్ప వార్త
నరుడ నెరుగ నట్టి నారి తాననుచు నే
గర్భమెట్లు పొంద గల్గు ననెను
ముక్తి మోక్ష దాత ముందె వ్రాసె ననుచున్
పలికె గాబ్రియేలు మరియ తోను
సంతసంబు తోడ సందేహములు వీడి
మనసు కుదుట పడెనె మరియ కపుడు
మగువ మాట వినుచు మరి వీడె దూతయు
ధన్యురాలు నెలత దాత్రిలోన
మరియ గర్భవతని మరి తెల్సిన యోసేపు
విముకుడయ్యి తాను విడువ దలచె
కడకు దేవదూత కలయందు అగుపించి
విడువ వలదు యనుచు వితము చెప్పె
నిదుర మత్తు వీడి నిశ్చల మనసుతో
మరియ నాదరింప మదిన దలచె
దూత పల్కు వినుచు దుర్నీతి విడచుచూ
ఏసు బుట్టు వరకు ఎరుగ కుండె
యాజకుండు జకరియ ఎలిసబేతులు
సుతుని పొందునన్న సూనృతమ్ము
గాబ్రియేలు దెల్పె గర్త మరియకును
ఎలిసబేతు కడకు ఎరిగి వచ్చె
మరియ రాక గాంచి మగువ ఎలిసబేతు
ధన్యురాలి వనుచు దరికి చేరె
గర్భమందు శిశువు గంతులు వేయుచు
సంత సంబు గలిగి సంతషించె
అతివ లందు వీవు ఆశీర్వదము నొంది
ఘన కీర్తి పొందు గరిత వనుచు
పరిశుదాత్మ నిండి పడతి ఎలిసబేతు
పలికె పసిడి వాక్కు మరియు తోను
ముదిత మరియ గడిపె మూడు మాసంబులు
ఎలిసబేతు నొదలి ఏగె యూరు
కనికరమ్ము బొంది కనెను యోహానును
జన్మ ధన్యమాయె జకరియకును
సర్వలోకజనుల సంఖ్య నమోదుకు
పయనమయ్యి పోయె మరియతోను
బెత్లహేము జేరి మరియ యోసేపులు
జనము గణన కెక్కె జనుల తోను
ప్రసవ గడియ నిండి పసిబిడ్డను గనెనే
స్థలము లేకపోయె సత్రమందు
పశుల తొట్టినందు పడుకొన బెట్టెనే
దిక్కు లేక మరియ దీనురాలై
గొర్రె మంద కాచు గొర్రెల కాపరుల్
అదిరిపడిరి యంత అర్థరాత్రి
దివియు నుండి భువికి దిగివచ్చుచునె దూత
ఏసు పుట్టె ననుచు ఎరుక దెల్పె
అదురు బెదురు వీడి ఆనంద భరితులై
వేగిరమున చేరె యేసు చెంత
పసులపాకనున్న బాలయేసును చూచి
సంతసించి మదిన సంబ్రమొందె
ఏసు జన్మ మెరిగి ఏతెంచె జ్ఞానులు
రాజు ఎచట యనుచు రాజు నడిగె
యేసు నాదు కీర్తి హేరోదు వినుచునే
కలవరపడి తాను కలత నొందె
ఏసు విభుని జన్మ ఎరిగిన హేరోదు
కుటిల వర్తనుండై కుట్ర బన్నె
ఏసురాజు గొల్వ ఏతెంచెద మనచు
మట్టు బెట్టదలచె మనసు యందు
ఆకసమున తార ఆనవంబులతోను
అనుసరించి సాగి యచట చేరె
సాగిలపడిరంత సర్వేశ్వరుని గొలిచి
పసిడి బోళ మిచ్చి పరవశించె.
అనిల్ కుమార్ దారివేముల
మాచర్ల, పల్నాడు జిల్లా.



Post Comment