మొక్క జొన్న రైతులకు అండగా ఉంటాము

మొక్క‌జొన్న రైతుల‌కు అండ‌గా ఉంటాం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు
పౌల్ట్రీ, విత్తనాలు, ఫార్మా, ట్రేడర్లు కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశం
25% ఉత్పత్తి సేకరణకు 7,630.44 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు అభ్యర్థన

రాజధాని వాయిస్:అమ‌రావ‌తి, న‌వంబ‌ర్ 27.

మొక్కజొన్న కొనుగోలు అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ‌లోని క్యాంప్ కార్యాల‌యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. పౌల్ట్రీ, విత్తనాల సంస్థలు, ఫార్మా రంగం, ట్రేడర్లు రేట్లు తగ్గించకుండా, క్వాంటిటీ తగ్గించకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. పరిశ్రమలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఖరీఫ్–2025 కనీస మద్దతు ధర కింద మొక్కజొన్న సేకరణకు అనుమతి ఇవ్వాలని ఏపి మార్క్ ప్రెడ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అలాగే సేకరణ చేపట్టేందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ నుంచి మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. ఈ సీజన్‌లో 1,42,282 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరగగా, అంచనా ఉత్పత్తి 8,18,753 మెట్రిక్ టన్నులు ఉండనున్నాయని వివరించారు. రైతులను రక్షించేందుకు మొత్తం ఉత్పత్తిలో 25% అంటే 2,04,688 మెట్రిక్ టన్నులు ప్రభుత్వమే సేకరించేందుకు సిద్ధంగా ఉందని, ఈ క్రమంలో ధరల స్థిరీకరణ నిధి నుండి రూ. 7,630.44 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. అదనంగా, నంద్యాల జిల్లాలో ఏపి మార్క్ ప్రెడ్, ఫార్ మార్ట్, అగ్-టెక్ ప్లాట్‌ఫార్మ్,ఐఎఫ్సి మద్దతుతో కొత్త మార్కెట్ అనుసంధాన పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినట్లు వివరించారు. రైతులకు లాజిస్టిక్స్, నిల్వ, డిజిటల్ ట్రేసబిలిటీ, ఫండింగ్ వంటి సౌకర్యాలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో పౌల్ట్రీ, పశువుల దాణా తయారీదారులు, స్టార్చ్ & ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డిస్టిలరీలు, ఎథనాల్–బయోఫ్యూయల్ యూనిట్లు, బూరవీరు వాణిజ్య సంస్థలతో పెద్ద స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్న వినియోగించే అన్ని పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెంచడం లక్ష్యమని చెప్పారు. మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు నష్టపోకుండా, మార్కెట్‌ను స్థిరపరిచే అన్ని చర్యలు ప్రభుత్వం వేగంగా చేపడుతోందని తెలియ‌జేశారు.

Post Comment

You May Have Missed

0Shares