మొంథా తుఫాన్ తీవ్రత తగ్గినా విద్యుత్, రవాణా ఇబ్బందులు 

 మంత్రి అచ్చెన్నాయుడు

 

రాజధాని వాయిస్ : అక్టోబర్ 29 అమలాపురం

మొంథా తుఫాన్ ముందుగా ఊహించినంత తీవ్రత కనబరచకపోయినా, విద్యుత్ సరఫరా మరియు రహదారి రవాణా వ్యవస్థలకు ఇబ్బందులు కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన, మార్కెటింగ్, డైరి, రీడెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తుఫాన్ సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుఫాన్ ఈదురుగాలుల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సుమారు 300 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని, వాటి పునరుద్ధరణ పనుల్లో 80 శాతం పూర్తి అయ్యిందని, మిగిలిన 20 శాతం పనులు రాబోయే రెండు గంటల్లో పూర్తి చేసి ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. ఎంఈడీ పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు రేయింబవళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 54 సబ్‌స్టేషన్లు తుఫాన్ ప్రభావానికి లోనయ్యాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయాలని సూచించారని, ఆ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రామచంద్రపురం, రాజమహేంద్రవరం, ముమ్మిడివరం వంటి ప్రాంతాల నుండి మానవ వనరులను తరలించి విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 134 కిలోమీటర్ల మేర రహదారులపై కూలిన వృక్షాలను తొలగించి రాకపోకలను పూర్తిగా పునరుద్ధరించామని, నేటి నుండి ఆర్టీసీ బస్సులు నూటికి నూరు శాతం రాకపోకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం పునరావాస కేంద్రాలలో భోజన వసతి పొందిన వారందరికీ బుధవారం సాయంత్రం వరకు ఆశ్రయం కల్పించి, రాత్రి భోజనం అనంతరం స్వగృహాలకు పంపించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3,000 ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని అధికారులు ఆదేశించారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 400 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 10,150 మందికి ఆశ్రయం కల్పించామని, వీరిలో ప్రతి కుటుంబానికి రూ.3,000 చొప్పున, ఒంటరి వ్యక్తులకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు తుఫాన్ ప్రభావంతో ఐదు రోజులుగా ఉపాధి కోల్పోయినందున వారికి 50 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. బియ్యం పంపిణీని రేషన్ డీలర్ల ద్వారా నేటి నుండే ప్రారంభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నిశాంతిని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల వరి పంట తుఫాన్ ప్రభావంతో నష్టపోయిందని, అలాగే ఉద్యాన పంటలైన అరటి తదితర పంటలు కూడా నష్టానికి గురైనట్లు తెలిపారు. ఈ నష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పంటల నష్టాలను తగ్గించేందుకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో చర్యలు తీసుకుంటామని, ఆర్థిక సహాయం పారదర్శకంగా అందజేయాలని సూచించారు. బియ్యం, ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకోవాలని ఆదేశించారు. మామిడికుదురు మండలంలో తుఫాన్ సమయంలో మరణించిన మహిళ కుటుంబానికి, పోస్ట్‌మార్టం అనంతరం ఐదు లక్షల రూపాయల పరిహారం స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి. విజయరామరాజు, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎంపీ జి. హరీష్ మాధుర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఎమ్మెల్యేలు అయితాపత్తులు ఆనందరావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, అమలాపురం చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మెట్ల రమణబాబు (డిఆర్ఓ), కే. మాధవి తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares