బాధిత కుటుంబాల వెన్నంటే ప్రభుత్వం… మీ కోసం మేమున్నాం ..
బాధిత కుటుంబాలకు ధైర్యం నింపిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కేంద్ర–రాష్ట్ర మంత్రులు
టెక్కలి నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున చెక్కుల అందజేత
పలాస ఆసుపత్రిలో క్షతగాత్రులకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం పంపిణీ
సమగ్ర విచారణకు ప్రభుత్వం సిద్ధం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు- మంత్రి అచ్చెన్నాయుడు
రాజధాని వాయిస్:
నవంబర్ 2
అమరావతి.
మేమున్నాం మీకేం కాదని అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.
కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రిల్స్ విరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలను
కేంద్ర–రాష్ట్ర మంత్రులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ధృవీకరించారు.ఆదివారం నాడు మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి బాధితుల నివాసాలకు వెళ్లి వారి దుఃఖంలో భాగమయ్యారు. కష్ట సమయంలో ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి చేస్తున్నదని, ప్రతి కుటుంబం వెన్నంటే నిలబడతామని హామీ ఇచ్చారు.
*తక్షణ సహాయం అందించిన ప్రభుత్వం*
మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 లక్షల చెక్కులను మంత్రులు స్వయంగా అందజేశారు. టెక్కలి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు బాధిత కుటుంబాలకు చెక్కులు అందించారు. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రూ. 3 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.
ఈ ఘటనలో అనుకోని రద్దీ, ఆలయ నిర్వాహకుల తగిన ఏర్పాట్ల లోపం కారణమై ప్రమాదం సంభవించినట్లు అధికారులు వివరించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రైవేటు ఆలయం కావడంతో నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చని, అయినప్పటికీ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని సమగ్ర విచారణ చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనను రాజకీయాలకు అన్వయించడం సరికాదు. మానవ తప్పిదం కనిపించకపోయినా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు.బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఎంతో బాధాకరం. వారు ఎదుర్కొంటున్న పరిస్థితి మాటల్లో చెప్పలేనిది. కానీ ప్రభుత్వం మీ వెన్నంటే ఉంది. మీ కుటుంబాల పునరావాసం, అవసరమైన సహాయం అన్ని విధాలా అందిస్తాం. మీ కోసం మేమున్నాం అని మంత్రులు హామీ ఇచ్చారు.



Post Comment