పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి…

 

••వారి కుటుంబాలకు ప్రభుతం అండగా ఉంటుంది

••పోలీసు అమరవీరులకు ఘననివాళి అర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు

రాజధాని వాయిస్ : శ్రీకాకుళం. అక్టోబర్ 21

ప్రజారక్షణ విధుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీసుల త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి, తదుపరి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘన నివాళులర్పించారు. పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రజలు సంతోషంగా జీవిస్తారని ఆయన అన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, మానప్రాణాల రక్షణలో పోలీసులు చూపిస్తున్న అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. సరిహద్దులో దేశాన్ని కాపాడే సైనికులు ఒక ఎత్తైతే, దేశంలో ప్రజల భద్రతను కాపాడే పోలీసులు మరో ఎత్తుఅని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు, పోలీసుల ధైర్యం, త్యాగం దేశానికి గర్వకారణమని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులతో మాట్లాడుతూ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి, వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శాంతి కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సేవలు ప్రజాస్వామ్య బలానికి పునాది అని పేర్కొన్నారు. మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ పనితీరుపై గర్వపడుతున్నానని తెలిపారు. నక్సలిజం అరికట్టడంలో, గంజాయి మరియు మాదకద్రవ్యాల రవాణాను నియంత్రించడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గంజాయి, మాదకద్రవ్యాల రవాణా విచ్చలవిడిగా జరిగిందని విమర్శించారు. మాదక ద్రవ్యాల వాడకం వలనే మహిళలపై అఘాయిత్యాలు, అపహరణలు, రోడ్డు ప్రమాదాల వంటివి జరుగుతున్నాయని , వీటిని అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు అధికారులను సూచించారు. సైబర్ క్రైమ్‌పై ప్రజల్లో అవగాహన పెంచుతూ, టెక్నాలజీ సాయంతో నేరస్తులను పట్టుకోవాలన్నారు. ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం. రాత్రింబవళ్లు కష్టపడే పోలీసు సిబ్బందికి నా మనఃపూర్వక అభినందనలు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

ఉద్యోగులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారి సంక్షేమానికి ‌ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి‌ బాగులేక పోయిన డీఎ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్రని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా పోలీసులను అభినందనలు తెలిపారు. రాష్ట్ర 6,300 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నియామకం చేపట్టామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు ఓపెన్ హౌస్ ప్రారంభించారు.
కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు, పార్లమెంటు సభ్యులు కలిశేట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

Post Comment

You May Have Missed

0Shares