పచ్చని పరిసరాలే ప్రజల ప్రగతికి పునాది
గళ్ళా మాధవి
రాజధాని వాయిస్ : గుంటూరు.అక్టోబర్ 18
పచ్చని పరిసరాలే ప్రజల ప్రగతికి పునాదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. అదే విధంగా మిర్చి యార్డు సమీపంలో మిర్చి తొడాలను జనావాసాల మధ్య తగలబెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్ ను కోరారు.
శనివారం గుంటూరులో జరిగిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ,
రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర వైపు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
స్వచ్ఛమైన పరిసరాలు, పచ్చని వాతావరణం, పరిశుభ్రమైన గాలి
ప్రజల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని, క్లీన్ ఎయిర్ గ్రీన్ ఎయిర్ అనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, మొక్కల నాటడం వంటి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కలెక్టరేట్ నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ర్యాలీ నిర్వహించి, ఆ ప్రాంతంలో మొక్కలు నాటామన్నారు.
మన పరిసరాల్లోని 40-50 సంవత్సరాల వయసు ఉన్న చెట్లను శాశ్వతంగా తొలగించకుండా, ఆ చెట్టును రీలోకేట్ చేసే విధానాన్ని అమలు చేయాలని కమిషనర్ ను కోరారు. ఒక చెట్టు పెరగడానికి దశాబ్దాల సమయం పడుతుంది.
ఆ చెట్టు మనకు అందించే ఆక్సిజన్, నీడ, తేమలను మనం మళ్లీ తక్షణం పొందలేం. కాబట్టి పాత చెట్లను కాపాడటం మనందరి ధర్మం అని వివరించారు.
అదేవిధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని పచ్చని నియోజకవర్గంగా మార్చే లక్ష్యంతో పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అదే విధంగా మిర్చి యార్డు సమీపంలో మిర్చి తొడలను రోడ్డుపై వేసి దహనం చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, దీని వల్ల చుట్టుపక్కల ప్రజలు గొంతులో మంట, శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
స్వచ్ఛ గుంటూరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, పచ్చదనం–పరిశుభ్రతతో కూడిన గుంటూరు వైపు అందరం కలిసి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.



Post Comment