– చైతన్యమే నివారణకు మార్గం – గుంటూరు జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చండి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య – డ్రగ్స్ నివారణపై ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ – హాజరైన ఈగల్ టీమ్ ఐజీ ఆర్కే రవికృష్ణ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్
రాజధాని వాయిస్:డిశంబర్ 23,గుంటూరు.
యువత జీవితాలను చీకటిమయం చేస్తోన్న డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధం చేద్దామంటూ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ ఆధ్వర్యంలో యువత నినదించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ గుంటూరులో కదంతొక్కారు. డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యసాధలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి నాని, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఈగల్ సెల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజరైన కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ముందుండి నడిపించారు. గుంటూరు నగరంలోని గాంధీ పార్కు నుంచి ఎన్టీఆర్ ఐలాండ్ వరకు సాగిన భారీ ర్యాలీలో టీఎన్ఎస్ఎఫ్ గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు ఐలా పవన్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు…బంగారు భవితే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ ఐలాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పానికి అనుగుణంగా డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే నసీర్ ను అభినందించారు. గతంలో కలరా వంటి రోగాల గురించి మాట్లాడుకునే వారమని, ఇప్పుడు మాదక ద్రవ్యాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ నివారణపై సామాజిక యుద్ధం చేయాలని, యువత చైతన్యవంతం కావాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. గుంటూరు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఈగల్ సెల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా, కలిగి ఉన్నా నేరమని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయితే జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో డ్రగ్స్ మహమ్మారి విచ్చలవిడిగా పెరిగిపోయిందని చెప్పారు. దీనిని కూకటివేళ్లతో పెకలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఈగల్ టీమ్ ద్వారా కృషి చేస్తోందని తెలిపారు. ఎందరో తల్లులు తమ బిడ్డలు డ్రగ్స్ కు బానిస కావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి ఉండకూడదని, డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని యువతకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఐసీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రావు, గ్రంథాలయ మాజీ చైర్మన్ దాసరి రాజామాస్టర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post Comment