జగన్ అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు

 

మంత్రి అచ్చెన్నాయుడు

రాజధాని వాయిస్: అక్టోబర్ 30. అమరావతి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అబద్ధాల తుపాను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యవసాయ, సహకార, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు.
తుఫాను ప్రభావం, పంటల నష్టంపై మాట్లాడే ముందు జగన్ తన పాలనలో రైతులకు చేసిన అన్యాయాలను గుర్తు చేసుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమం పేరుతో మాట్లాడే హక్కు జగన్ రెడ్డికి లేదు. ఆయన పాలనలోనే రైతులు కష్టాల బాట పట్టారు. ఉచిత పంట బీమా పేరుతో కోట్ల రూపాయల మోసం జరిగింది. బీమా కోసం రైతులు నెలల తరబడి తిరిగినా, ఒక్కరూపాయి పరిహారం కూడా అందలేదు. ఇప్పుడు బేషరతుగా బీభత్స గణాంకాలు చెప్పి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ పేర్కొన్న ఇ-క్రాప్, ఆర్బీకే, సచివాలయ వ్యవస్థలు కేవలం రాజకీయ ప్రదర్శనలేనని, నేల మీద వాటి ఫలితం శూన్యమని మంత్రి తేల్చిచెప్పారు.
మీ పాలనలో రైతులు నష్టపోయినా, పరిహారం ఇవ్వలేదు. మిర్చి, మామిడి, పొగాకు కొనుగోళ్లు చేస్తామన్నారు.కానీ ఒక్క రూపాయి చెల్లించలేదు. రైతుల చెమటను చెల్లని వాగ్దానాలతో తుడిచిన పాలన జగన్‌దే అని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన అంచనా పనులు జరిపి, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలు,తక్షణ సహాయ చర్యలు, బీమా పరిహారాలు అందజేస్తోందని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రైతు కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మాటలు కాదు చర్యలతో మేము నిరూపిస్తున్నాం అని ఆయన స్పష్టం చేశారు.

రైతు శ్రేయస్సేకూటమి ప్రభుత్వ ధ్యేయం.. 

రైతు కష్టసుఖాల్లో అండగా నిలవడం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముడవుతున్న పంటలకు వెంటనే మార్కెట్ జోక్యాన్ని అందించేందుకు ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి రూ.300 కోట్లను బడ్జెట్‌లో మంజూరు చేసిందన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.800 కోట్ల వరకు పంటల మద్దతు ధరల కోసం ఖర్చు పెట్టాం అని మంత్రి వివరించారు. వైసిపి హయాంలో 2020లో మిర్చీ ధర రూ.12,000 ఉన్నా, మద్దతు ధరగా రూ.7,000 మాత్రమే నిర్ణయించి, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మంత్రి మండిపడ్డారు. హెచ్.డి. బర్లీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం 271 కోట్లు వెచ్చించి 20 వేల మిలియన్ కిలోల కొనుగోలు నిర్ణయం తీసుకుందని, అదనంగా వచ్చిన పంట కూడా మేమే కొనుగోలు చేశామన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కోకో ధరలు తగ్గడంతో కిలోకు ₹50 చొప్పున చెల్లించాం. తోతాపూరి మామిడి ధరలు తగ్గినప్పుడు ₹260 కోట్లు వెచ్చించి ప్రతి కిలోకు అదనంగా ₹4 చొప్పున చెల్లించాం. టమాటా రైతులకు ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు సరసమైన ధరలు అందించడానికి ₹8 కోట్లు వెచ్చించి రైతుల వద్ద నుండి 1781 మెట్రిక్ టన్నులు సేకరించి రైతు బజార్ల ద్వారా విక్రయించాం. అలాగే ధరలు తగ్గినప్పుడు ₹3.25 కోట్లతో సుమారు 2800 మెట్రిక్ టన్నుల టమాటా కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కలిగించాం. 2019–24 మధ్య వైసిపి ప్రభుత్వం కేవలం 3780 మెట్రిక్ టన్నుల టమాటా సేకరించగా, మా ప్రభుత్వం కేవలం 14 నెలల్లోనే 4672 మెట్రిక్ టన్నులు సేకరించిందన్న విషయం జగన్ తెలుసుకోవాలని అన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి ధరలు తగ్గిన నేపథ్యంలో, మా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మార్క్‌ఫెడ్ మరియు మార్కెటింగ్ శాఖల ద్వారా రూ.1200 క్వింటాకు కొనుగోలు చేశాం. కూటమి ప్రభుత్వం రైతు కష్టానికి అండగా ఉంది. రైతు ఉత్పత్తికి విలువ, శ్రమకు గౌరవం కల్పించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. మాటలు కాదు చర్యలతో రైతు పక్షపాతం నిరూపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Post Comment

You May Have Missed

0Shares