అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త..
25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులు, ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం
ఫ్రోజెన్ ష్రింప్ సహా సముద్ర ఆహార ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం
యూరోప్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వంటి అమెరికేతర మార్కెట్లకు స్థిరంగా కొనసాగుతున్న ఎగుమతులు
రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి అచ్చెన్న
రాజధాని వాయిస్ :ఫిబ్రవరి 3 అమరావతి
అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కింద ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. గతంలో 25 శాతం టారిఫ్‌కు అదనంగా శిక్షాత్మక టారిఫ్‌లతో కలిపి మొత్తం 50–58 శాతం వరకు టారిఫ్ భారం పడటంతో, 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ కాలంలో అమెరికాకు భారతదేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులు పరిమాణంలో సుమారు 15 శాతం తగ్గి 2.01 లక్షల మెట్రిక్ టన్నులకు, విలువలో 6.3 శాతం తగ్గి 1.72 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయాయని గుర్తు చేశారు. ముఖ్యంగా అమెరికాకు ప్రధానంగా ఎగుమతి అయ్యే ఫ్రోజెన్ ష్రింప్ ఈ పరిస్థితి వల్ల తీవ్రంగా ప్రభావితమైందన్నారు. టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడంతో అమెరికా మార్కెట్లో భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల పోటీ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని, నిలిచిపోయిన కొత్త ఎగుమతి ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతూ, బాండెడ్ గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును విడుదల చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రాబోయే నెలల్లో అమెరికాకు సముద్ర ఆహార ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని, 2025–26 రెండో అర్ధభాగంలో ఎగుమతులు టారిఫ్‌కు ముందు ఉన్న స్థాయికి చేరుకునే అవకాశముందని చెప్పారు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలోని లాభ మార్జిన్లు కూడా మెరుగవుతాయని, అధిక టారిఫ్ కాలంలో 5–5.5 శాతానికి తగ్గిన ప్రాసెసర్ల మార్జిన్లు టారిఫ్ తగ్గింపు అనంతరం తిరిగి 7–8 శాతం స్థాయికి చేరే అవకాశముందన్నారు. కేంద్ర బడ్జెట్ – 2026లో సముద్ర ఆహార ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందించనున్నాయని తెలిపారు. అమెరికా మార్కెట్ పునరుద్ధరణతో పాటు యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్డమ్ వంటి అమెరికేతర మార్కెట్లకు భారతీయ సముద్ర ఆహార ఎగుమతులు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని, 2025–26 ప్రారంభంలో ష్రింప్ ఎగుమతుల్లో అమెరికేతర మార్కెట్ల వాటా సుమారు 57 శాతానికి చేరడం మార్కెట్ విభిన్నీకరణకు నిదర్శనమని అన్నారు. దేశంలో సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని, ఎగుమతుల పునరుద్ధరణతో రాష్ట్రంలోని మత్స్య, ఆక్వా రంగాల్లో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, స్థూల విలువ జోడింపు (GVA) కూడా మెరుగుపడతాయని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. MPEDA అంచనాల ప్రకారం 2025–26 లో దేశవ్యాప్తంగా మొత్తం సముద్ర ఆహార ఎగుమతులు 14–15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరే అవకాశముందని పేర్కొంటూ, మొత్తం మీద అమెరికా టారిఫ్‌ను 18 శాతానికి తగ్గించడం భారతీయ సముద్ర ఆహార ఎగుమతుల పునరుద్ధరణకు, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం స్థిరమైన అభివృద్ధికి కీలకంగా నిలుస్తుందని తెలిపారు.



Post Comment